రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కసరత్తు చివరి దశకు చేరుకుంది. రెండు రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ సమావేశమైన చంద్రబాబు.. నామినేటెడ్ పదవులపై చర్చించారు. అలాగే.. బీజేపీ కూడా తమ నేతల పేర్లతో జాబితా అందజేసింది. దాంతో.. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే రెండో విడత నామినేటెడ్ పదవుల లిస్ట్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇక.. కూటమి నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చంద్రబాబుపై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. అయితే.. పార్టీ కోసం, ఎన్నికల్లో కూటమి విజయం కోసం పని చేసిన అనేక మంది నేతలు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. కానీ.. నామినేటెడ్ పోస్టులను మూడు పార్టీలకు ఇవ్వాల్సి ఉండడంతో ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఏ పోస్టు ఇవ్వాలనేదానిపై సీఎం చంద్రబాబు.. మిగతా రెండు పార్టీలతోనూ కూలంకషంగా చర్చలు చేశారు. దాంతో.. రెండో విడత నామినేటెడ్ పోస్టుల జాబితా దాదాపు ఫైనల్ అయినట్లు కూటమి పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. రెండో విడతలో జనసేనకు ఎన్ని ఇవ్వాలి?.. బీజేపీకి ఎన్ని ఇవ్వాలి?.. టీడీపీకి ఎన్ని కేటాయించాలి?.. అనే దానిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేతలు
ఇక.. రెండో విడత నామినేటెడ్ పదవులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి టీడీపీ నేతల నుంచి చంద్రబాబుపై ప్రెజర్ ఉంది. గతంలో పార్టీ కోసం అనేకమైన కేసులు ఎదుర్కొని పని చేసిన వారంతా నామినేటెడ్ పోస్టుల ద్వారా తమకు న్యాయం చేయాలని అధినేతకు విజ్ఞప్తి చేశారు. అలాగే.. పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతల నుంచి కూడా ఒత్తిళ్లు ఉన్నాయి. తమ వర్గానికి చెందిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో.. ఆ కోణంలోనూ కసరత్తు చేసినట్లు టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దాదాపు లిస్ట్ ఫైనలేజ్ అవుతుండడంతో.. ఎవరికి ఏ పదవి ఇస్తే బాగుంటుందనేదానిపైనా ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. అయితే.. ఈ సారి కూటమి పక్షాలకే ప్రాధాన్యత అని ముందే ప్రకటించిన నేపథ్యంలో ముందుగా జనసేనకు.. ఆ తర్వాత బీజేపీకి చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేసమయంలో.. ముఖ్యమైన పోస్టులను ఆయా ప్రాంతాలను బట్టి, ప్రభావితం చేసే నేతలను దృష్టిలో పెట్టుకుని కేటాయించే చాన్స్ ఉంది. మొత్తంగా.. రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు క్లారిటీకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ, రేపట్లో ఎప్పుడైనా.. ఏ క్షణమైనా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో సెకండ్ ఫేజ్ నామినేటెడ్ లిస్ట్ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. రెండో దశలో కూటమి పార్టీల్లో ఎవరెవరికి చాన్స్ దక్కుతుందో?.. ఎవరిని నామినేటెడ్ పదవులు వరిస్తాయో చూడాలి.