
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాయి..! మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల కుటుంబాలకు చెందిన వాళ్లూ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. బొత్స సత్యనారాయణ కుమార్తె నుంచి మాజీ ఎంపీలు గొట్టేటి మాధవి, అనురాధ వరకు.. చాలామంది ఓడిపోవడం అవాక్కయ్యేలా చేసింది. మరోవైపు.. ఎన్నికల నిర్వహణ,ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోజా, వల్లభనేని వంశీ, జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిరసనలకు దిగడం టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది.
పరిషత్ ఫలితాల్లోనూ వైసీపీకి ఎదురుదెబ్బే తగిలింది.పార్టీకి చెందిన కీలక నేతల కుటుంబ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష పరాజయం వైసీపీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. విజయనగరం జిల్లా బొండపల్లి జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి… టీడీపీ అభ్యర్థి పాశల నీరజ చేతిలో 5,136 ఓట్ల తేడాతో అనూష ఓటమి పాలయ్యారు. అలాగే… మాజీ ఎంపీలు గొట్టేటి మాధవి, అనురాధ సైతం ఓటమి చవిచూడటం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
మరోవైపు… ఫలితాలపై వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడం రచ్చ లేపింది. తమ అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ నగరిలో మాజీ మంత్రి రోజా ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ ఎన్నికలో వైసీసీ అభ్యర్థి గెలిచినా… టీడీపీకి విజయాన్ని కట్టబెట్టారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ఇటు గన్నవరంలో వల్లభనేని వంశీ నిరసన గళం వినిపించారు. వైసీపీ అభ్యర్థి అనగాని రవి విజయం సాధించినప్పటికీ, కూటమి నేతలు రీకౌంటింగ్ కోరడంతో ఆందోళన చేపట్టారు. అలాగే… కూటమి తీరుకు నిరసనగా రాజమండ్రిలో జక్కంపూడి రాజా, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం నిరసన బాట పట్టారు. దీంతో ఎన్నికల ఫలితాల కంటే… నిరసనలే రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుత పరిణామాలపై సరికొత్త చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో వైసీపీకి పట్టు తగ్గుతోందా..? స్థానికంగా నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందా…? కీలక నేతల వారసుల ఓటమి పార్టీకి… వార్నింగ్ అనుకోవచ్చా..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఓటమికి కారణాలు, నిరసనల వెనుక ఉన్న ఆరోపణలు, నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులను వైసీపీ నిశితంగా పరిశీలిస్తోంది. మరీ ఫలితాల నుంచి వైసీపీ ఎలాంటి పాఠాలు నేర్చుకుంటుంది…! భవిష్యత్తు రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..