Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నిధులు.. మారనున్న రూపురేఖలు

ఏపీకి కేంద్రం మరో శుభవార్త అందించింది. మచిలీటప్నం పోర్ట్‌ కోసం ఆరు లైన్ల భారీ రహదారి నిర్మించనుంది. ఇందుకోసం తాజాగా నిధులు మంజూరు చేసింది. దీని వల్ల పోర్ట్ కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. సరఫరాలో మరింత వేగం పెరగనుంది.

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నిధులు.. మారనున్న రూపురేఖలు
Andhra Pradesh

Updated on: Feb 06, 2026 | 7:14 AM

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ అందించింది. ఏపీలో మరో కీలక ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టనుంది. రాష్ట్రంలో ఆరు లైన్ల భారీ రోడ్డును కేంద్రం తన నిధులతో నిర్మించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. ఇటీవల బడ్జెట్‌ల్ ఏపీకి కేంద్రం అనేక కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. హైస్పీడ్ రైలు కారిడార్లతో పాటు అమరావతి, పోలవరంకు నిధులు కేటాయించింది. అలాగే ఏపీలో టూరిజం ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ క్రమంలో ఏపీలో మరో కీలక ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం రెడీ అవ్వడంతో రాష్ట్రానికి మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లయింది.

ఆరు లైన్ల భారీ రహదారి నిర్మాణం

ఏపీలో ఆరు లైన్ల భారీ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ముందడుగు వేసింది. మచిలీపట్నం పోర్ట్, నేషనల్ హైవే మధ్య కనెక్టివిటీ కోసం కేంద్రం రహదారి నిర్మించనుంది. ఇందుకోసం ఏకంగా రూ. 573.77 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. NH-65, NH-216 నుంచి మచిలీపట్నం పోర్ట్‌కు 6 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మచిలీపట్నం బైపాస్ మీదుగా కొత్త కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని, పోర్ట్ నుంచి హైవే కారిడార్‌కు నేరుగా అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. దీని వల్ల ఫ్రైట్ ట్రాన్స్‌పోర్ట్ టైమ్ భారీగా తగ్గే అవకాశముందని, ట్రాఫిక్ రద్దీ తగ్గి లాజిస్టిక్స్ సామర్థ్యం పెరుగుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టులో 6 లేన్ మెయిన్ రోడ్, సర్వీస్ రోడ్లు ఉండనున్నాయి. ఇక మధ్యలో మూడు ఫ్లైఓవర్లు, ఓ రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుందని గడ్కరీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

పవన్, లోకేష్ ట్వీట్

డిసెంబర్ 2026 నాటికి ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురావానే లక్ష్యం పెట్టుకున్నారు. అటు ఈ రోడ్డుకు నిధులు మంజూరుపై నితిన్ గడ్కరీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారితో కనెక్ట్ చేసేందుకు 6 లైన్ల రోడ్డు నిర్మించడం మంచి పరిణామమన్నారు. ఇందుకుగాను ఏపీ ప్రభుత్వం, ప్రజల తరపున గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ పవన్ తెలిపారు. ఇక మంత్రి నారా లోకేష్ కూడా గడ్కరీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. “ఏపీ మౌలిక సదుపాయాలు, ఓడరేవు ఆధారిత వృద్ధికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మచిలీపట్నం పోర్టుకు ఈ 6-లేన్ల బాహ్య కనెక్టివిటీ రహదారి లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో, రాష్ట్రానికి కొత్త ఆర్థిక అవకాశాలను తెరవడంలో సహాయపడుతుంది. భారతదేశ వృద్ధికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శక్తినిచ్చే ప్రపంచ స్థాయి రహదారులను నిర్మించడంలో మీ నిరంతర కృషి ధన్యవాదాలు” అని లోకేష్ పేర్కొన్నారు.