
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఛార్జీలకు అనుగుణంగా నూతన మెనూను కూడా ఖరారు చేసింది. గుడ్లు, చికెన్, పాలు, పండ్లు వంటి పోషకాహారంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందించనుంది ప్రభుత్వం.
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల డైట్ ఛార్జీలు పెరిగాయి.
పెరిగిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు నూతన మెనూను ప్రభుత్వం ఖరారు చేసింది. వారంలో ఆరు రోజులు గుడ్లు.. మూడు రోజులు చికెన్.. ప్రతిరోజూ పాలు, పండ్లు అందించేలా మెనూను రూపొందించింది.
విద్యార్థులకు రుచికరమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందేలా మెనూలో పలు రకాల వంటకాలను చేర్చారు. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు పులిహోర, ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటి అల్పాహార పదార్థాలు ఉన్నాయి. మల్టీ మిల్లెట్ చిక్కీలు, రాగి లడ్డూ, పండ్లు వంటి పోషకాహారాన్ని కూడా మెనూలో పొందుపరిచారు.
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో డైట్ ఛార్జీలను పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఈ పెంచిన డైట్ ఛార్జీలు అమలు కానున్నాయి.
డైట్ ఛార్జీల పెంపుతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే అవకాశం ఏర్పడిందని మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. విద్యతో పాటు విద్యార్థుల ఆహారం, ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.