Heatwave Alert: రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వాహణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. ఇక రాబోయే రోజుల్లు ఈ ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Heatwave Alert: రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
Heatwave Alert

Updated on: Apr 15, 2026 | 7:49 PM

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని.. గురువారం మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో అంతకు మించి గరిష్ఠంగా 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, హిరమండలం, పాతపట్నం మండలాలు, విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గుర్ల, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రాపురం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలాల్లో గురువారం తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

అలాగే శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం 6, మన్యం 1, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 5, తూర్పుగోదావరి 10, ఏలూరు 4, ఎన్టీఆర్ 3, గుంటూరు 1, పల్నాడు 15, మార్కాపురం 4, ప్రకాశం 2, నెల్లూరు2, కడప 1, తిరుపతి 1 మండలం ఇలా మొత్తంగా 67 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయన్నారు. ఇక శుక్రవారం 37 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బుధవారం నంద్యాల జిల్లా సంజామలలో 44. 6డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 44.5 డిగ్రీలు, కడపలో 44.1డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 44 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.9 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.5 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43 డిగ్రీలు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 43 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా గాలివీడులో 41.8 డిగ్రీలు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us