
దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోస్తాంధ్రలో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
వచ్చే రెండు రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే..?
ఆదివారం (19-07-2026) శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం (20-07-2026) విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ రోజు (శనివారం) సాయంత్రం 5 గంటల నాటికి కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 36.2 మిమీ, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 35.7మిమీ, కోనసీమ జిల్లా గంగవరంలో 29.7మిమీ, పోలవరం జిల్లా బుట్టాయిగూడెంలో 27.2మిమీ, కాకినాడ జిల్లా రాయభూపాలపట్నంలో 27.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
ప్రజలు జాగ్రత్త..
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు .సముద్రం అలజడిగా ఉండి, అలలు ఉధృతంగా ఉన్నప్పుడు చిన్నబోట్లు ఉపయోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..