
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓటర్లు భారీగా క్యూలైన్లలో నిల్చున్నారు. అయితే పోలింగ్ రోజున కూడా కొందరు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఓ పార్టీ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు, చీరలు పంపిణీ చేస్తుండగా.. మరో పార్టీ అభ్యర్థి ఓటర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇంకో పార్టీ అభ్యర్థి ఏకంగా ఓటర్ స్లిప్ ఉన్న ప్రతి ఒక్కరికీ కేజీ చికెన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించినట్టు సమాచారం. నెల్లూరులోని ఓ డివిజన్‌లో అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇలా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.