ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వడంతోపాటు.. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో, విశాఖలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓ వైపు రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. విశాఖ గర్జన సభ అనంతరం.. మంత్రులు తిరుగుపయనమయ్యారు. ఇదే సమయంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకుంటుండటంతో… జనసైనికులు విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రులు తిరిగి వెళుతుండగా.. అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. జోగిరమేష్, రోజా, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేసి.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన కార్యకర్తల దాడిలో మంత్రి జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసం కాగా.. మంత్రి రోజా సహాయకుడికి, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదంటూ పేర్కొన్నారు. జనసేన దాడిలో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడికి దిగారని ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. విశాఖ గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో దాడులు జరిపించారని మండిపడ్డారు. తమతో పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కల్యాన్ రాష్ట్రంలో తిరగలేరని ధ్వజమెత్తారు.
పవన్ క్షమాపణలు చెప్పాలి..
మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం జనసేనపై మండిపడ్డారు. జనసైనికులు కాదు.. జన సైకోలు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ గర్జనకు మద్దతుగా వచ్చిన మంత్రులు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జనసైకోలుగానే జనసేన కార్యకర్తలు ప్రవర్తించారని.. ఈ దాడికి పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది ఉత్తరాంధ్ర ఉద్యమం మీద జరిగిన దాడిగానే భావిస్తున్నామన్నారు. పవర్ స్టార్ కాదు.. ఫ్లవర్ స్టార్.. అంటూ అమర్‌నాథ్ మండిపడ్డారు. దీనిపై పవన్‌కళ్యాణ్ స్పందించి.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
జనసేన దౌర్జన్యం..
ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లపై విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జనసైనికులు దాడి చేశారంటూ ట్వీట్ చేశారు. ఈ దాడి ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జనసేనకు ఒక్క ఎమ్మెల్యే లేకపోతేనే ఎంత దౌర్జన్యం చేస్తే.. ఐదారు సీట్లు గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారోనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు ఉన్నాయని.. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..