
ఇమామ్, మౌజమ్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మూడు నెలలకు సంబంధించి గౌరవ వేతనాలను ఒకేసారి అకౌంట్లలో జమ చేయనుంది. దీంతో వారి అకౌంట్లలో ఒకేసారి రూ.30 వేలు జమ కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.22.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు చెల్లించాల్సిన జీతాలను ఒకసారి జమ చేయనున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో అడ్డంకులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం నిధులను ముందుగానే విడుదల చేసింది. ఈ విషయాన్ని వక్ప్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటినుంచో ఇమామ్, మౌజామ్లకు గౌరవ వేతనాలను అందిస్తోంది. అందులో భాగంగా జులై నుంచి నిలిచిపోయిన గౌరవ వేతనాలను ఇప్పుడు ఒకేసారి అందిస్తున్నారు.
ఇమామ్లకు నెలకు రూ.10 వేల చొపున అందిస్తుండగా.. మౌజామ్లకు రూ.5 వేలు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,991 ఇమామ్లు, 4991 మౌజామ్లకు కలిపి ప్రతీ నెలా 9982 మందికి వీటిని ప్రతీనెలా చెల్లిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో రాష్ట్రంలో డిసెంబర్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో జీతాలు చెల్లించేందుకు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటు ఈ నెల 20వ తేదీన దసరా రోజున ఎన్నికల కార్యకలాపాలకు విరామం ఇస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల సూచనతో ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూల్లో కూడా ఈ నెల 20వ తేదీన ఎలాంటి కార్యకలాపాలు జరపకుండా చూసుకుంది.
ఏపీ ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ నుంచి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరపనున్నారు. నవంబర్ 26న తొలి విడత, ఆ తర్వాత 29వ తేదీన రెండో విడత, డిసెంబర్ 2వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. నవంబర్ 13వ తేదీన తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 16న రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 19న మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 14వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.