
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని కోక్ ఓవెన్ 1 విభాగంలో జరిగిన ప్రమాదంలో అనంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతిచెందాడు. విధుల్లో ఉండగా ఐరన్ ముక్క పడటంతో ఆయన తీవ్రంగా గాయపడగా, చికిత్సకు ముందే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగింది? భద్రతా నిబంధనల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే గత జూన్ నెలలో ప్లాంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మరువకముందే మరో కార్మికుడు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు కొత్తేమీ కావని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లో గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజీలు, భారీ యంత్రాల ప్రమాదాలు వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రమాదాల కారణంగా పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా ప్రమాదం నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు తగిన భద్రతా పరికరాలు, శిక్షణ, పర్యవేక్షణ కల్పించాలని కోరుతున్నాయి. ప్రమాదాలకు దారితీసే లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి