
సాధారణంగా సినిమాల్లోనో, రౌడీ మూకల మధ్యనో గ్యాంగ్ వార్లను చూస్తుంటాం. కానీ మార్కాపురం జిల్లాలో విచిత్రమైన, భయానకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కోతులు రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్లపైనే పరస్పరం దాడులు చేసుకుంటూ గ్యాంగ్ వార్‌ను తలపిస్తున్నాయి. వందలాదిగా తరలివచ్చిన వానర సైన్యం ఊరి వీధులను రణరంగంగా మార్చడంతో స్థానిక ప్రజలు గడప దాటాలంటేనే వణికిపోతున్నారు. దోర్నాలలోని అమ్మవారి శాల వీధిలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. వేర్వేరు ప్రాంతాల నుంచి ఆహారం కోసం వచ్చిన వందలాది కోతులు ఒక్కసారిగా రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఒక గుంపుపై మరో గుంపు భీకరంగా దాడికి దిగింది. కోతుల వికృత చేష్టలు, భీకరమైన అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
రోడ్లపై సాగిన ఈ భీకర పోరాటాన్ని చూసిన స్థానికులు భయంతో ఇళ్లకు తాళాలు వేసుకుని లోపలే ఉండిపోయారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లలేక, పెద్దలు పనులకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతిరోజూ ఏదో ఒక వీధిలో ఇటువంటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయని, అడ్డువచ్చిన మనుషులపై కూడా కోతులు దాడి చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు లబోదిబోమంటున్నారు.
నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సరైన వర్షాలు కురవకపోవడంతో నల్లమల అటవీ ప్రాంతంలో సహజ నీటి వనరులు, పండ్ల చెట్లు ఎండిపోయాయి. తాగునీరు, తిండి దొరక్కపోవడంతో కోతులు గుంపులు గుంపులుగా గ్రామాల వైపు వలస వస్తున్నాయి. స్థానికంగా ఉండే కోతులకు, బయటి అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన కోతులకు మధ్య ఆహారం, ఆధిపత్యం కోసం తీవ్రమైన ఘర్షణలు తలెత్తుతున్నాయి. కేవలం దోర్నాల మాత్రమే కాకుండా నల్లమల సరిహద్దు మండలాలైన యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే రీతిలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది.
రోజురోజుకూ కోతుల ఆగడాలు మితిమీరిపోతుండటంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పంచాయతీ అధికారులు, అటవీ శాఖ యంత్రాంగం వెంటనే స్పందించి బోన్లు ఏర్పాటు చేయాలని, ఊళ్లపై పడుతున్న కోతుల గుంపులను పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.