
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రబీ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. ధాన్య సేకరణ ప్రారంభించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని, కొన్నిచోట్ల సాగు ఆలస్యమైనా రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. అదే ఉత్సాహంతో రబీ సీజన్ ధాన్యం సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే సేకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లకు తావు లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇక ధాన్యం కొన్న 24 గంటల్లోనే నిధులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేలా చర్యలు చేపట్టినట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.11,300 కోట్లను 24 గంటల్లోనే రైతులకు అందించినట్లు తెలిపారు. ఇక రూ.7,300 కోట్లను 8 గంటల్లోనే జమ చేశామన్నారు. అలాగే రబీలో 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇదొక రికార్డు అని చెప్పారు. 2.01 లక్షల మంది రైతులకు రూ.4,575 కోట్లను 48 గంటల్లో వేశామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించి ఈ సారి అవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి హయంలో ధాన్యం సేకరణ ఎక్కువ జరిగిందన్నారు.
గతంలో వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత నెల లేదా రెండు నెలలకు నిధులు జమ చేసేవారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఖరీఫ్‌కు సంబంధించి 2022-23లో 35.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా.. రైతులకు రూ.7,222 కోట్లు అందించారు. ఇక 2023-24లో 29.97 లక్షల మెట్రిక్ టన్నులు, 2024-25లో 35.95 లక్షల మెట్రిక్ టన్నులు, 2025-26లో 48.70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను చెల్లించిందని అన్నారు. ఖరీఫ్‌లో 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, రాష్ట్ర విభజన తర్వాత ఇదే అత్యధికమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు