
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్తి పన్నుపై పంచాయతీల్లో కూడా 5 శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం ఈ సూపర్ న్యూస్ తెలిపింది. అయితే మే 1 నుంచి 31వ తేదీల్లోపు పన్ను చెల్లించేవారికి మాత్రమే ఈ 5 శాతం రాయితీ అనేది వర్తిస్తుందని వెల్లడించింది. దీంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తి పన్నుపై రాయితీ పొందాలని సూచించింది. మే 1వ తేదీ నుంచి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించవచ్చు. ఈ అద్బుతమైన అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ స్పష్టం చేశారు.
అయితే ఇప్పటికే మున్నిపల్, నగర పంచాయతీల్లో ఆస్తి పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఆస్తి పన్ను చెల్లించేవారికి 5 శాతం రీబేట్ ప్రకటించింది. 2026-27కి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోగా చెల్లిస్తే 5 శాతం తగ్గించనున్నారు. అయితే 2025-26 ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ మాఫీ చేస్తోంది. ఎవరికైనా ఆస్తి పన్ను బకాయిలు ఉంటే చెల్లిస్తే ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే ఈ నెలాఖరుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30లోగా చెల్లిస్తే వడ్డీలో మాఫీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో పంచాయతీల్లో కూడా రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రూ.2,354 కోట్ల ఆస్తి వసూలైంది. గత ఏడాదితో పోలిస్తే 16.57 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా ఆస్తి పన్ను వసూలు చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అయితే గత ఏడాది విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో అత్యధికంగా ఆస్తి పన్ను వసూల్లు జరగ్గా..మంగళగిరి, తాడేపల్లి తొలి స్థానంలో నిలిచాయి. ఇక కర్నూలు, నెల్లూరు, విజయనగరం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.