Couple Adopt Snake In Andhra Pradesh: మీ ఇంట్లోకి అనుకోని అతిథిగా ఓ విష సర్పం వస్తే ఏం చేస్తారు.? ఏముంది.. అవకాశం ఉంటే పాములు పట్టే వ్యక్తిని పిలిపిస్తాం లేదంటే చంపడానికి ప్రయత్నిస్తామని చెబుతారు కదూ. మీరే కాదు మనలో చాలా మంది తీసుకునే నిర్ణయం ఇదే. కానీ అనంతపురానికి చెందిన ఓ జంట మాత్రం విభిన్న నిర్ణయం తీసుకుంది. ఇంటి పెరట్లోకి వచ్చిన ఓ పామును ఎంచక్కా పెంచి పోషిస్తోంది. దాన్ని ఓ పెట్ స్నేక్లాగా మార్చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. జర్మన్ దేశానికి సెబాస్టియన్ దంపతులు సత్యసాయి భక్తులు. వీరిద్దరి పుట్టపర్తిలోని ఉపాసన విల్లాస్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ పది అడుగుల విష సర్పం సోమవారం సెబాస్టియన్ జంట నివాసం ఉంటున్న ఇంటి గార్డెన్ ఏరియాలోకి వచ్చింది. పెరట్లో నిరుపయోగంగా పడి ఉన్న ఓ వలలో ఆ పాము ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గమనించిన దంపతులు వెంటనే పాములను పట్టే వ్యక్తిని పిలిపించారు. ఆ వ్యక్తి ఎలాగోలా వలను కత్తిరించి పామును బయటకు తీశాడు. అయితే పామును తనతో తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేయడం లేదా చంపేస్తానని ఆ వ్యక్తి చెప్పడంతో సెబాస్టియన్ జంట దానికి ససేమిరా అన్నారు. ఆ పామును ఎక్కడికి తీసుకెళ్ల వద్దని తామే పెంచుకుంటామని చెప్పారు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి వారి కోరిక మేరకు పామును అక్కడే వదిలేసి వెళ్లి పోయాడు. సెబాస్టియన్ దంపతులు ఆ పామును పెంచుకోవడం ప్రారంభించారు. దానికి అవసరమైన ఆహారం అందిస్తూ దాన్నో పెట్ స్నేక్లాగా చూసుకుంటున్నారు. దీంతో ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోవడంతో పాటు ఆ పాము వారిని ఏం చేస్తుందోనని భయపడుతున్నారు. ఏది ఏమైనా ఓ విష సర్పాన్ని పెంచుకోవాలనే ఈ వీదేశీ దంపతుల ఆలోచన నిజంగానే డిఫ్రెంట్ కదూ.
Also Read: LIC Alert: పాలసీదారులకు ముఖ్య గమనిక..! అలాంటి ఎస్ఎంఎస్ వస్తే స్పందించకండి..!