
అమరావతి, అక్టోబర్ 6: రాష్ట్రంలోని విద్యార్ధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి పరిమితి లేకుండా, ఎంతమంది విద్యార్ధులైనా చదువుకునే వీలుండాలని చెప్పారు. అలాగే దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింప చేయాలని సూచించారు.
ఇందులో 4 శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చెప్పారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు ఇస్తామని అన్నారు. మరోవైపు బీసీ విద్యార్ధులు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టంచేశారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమంపై మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఫరూఖ్, సవిత, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.