
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ కొనసాగుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాన్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరానికి సమీపంగా కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం అక్వాన్ తీవ్ర తుపాన్ నరసాపురానికి 420 కిలోమీటర్లు, కళింగపట్నానికి 400 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 490 కిలోమీటర్లు, పూరీకి 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం–పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తుపాన్ తీరం దాటే సమయంలో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించే వారు అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ ప్రభావం తగ్గే వరకు సముద్ర ప్రయాణాలకు దూరంగా ఉండటం, అత్యవసరమైతేనే బయటకు వెళ్లడం మంచిది.