
సొంత ఊరికి సేవ చేయాలన్న సంకల్పం ఆయనను ఒక్కసారి కాదు.. ఎనిమిదిసార్లు ఎన్నికల బరిలో నిలబెట్టింది. ప్రతిసారీ ఓటమి ఎదురైనా ఆయన ఆశయం మాత్రం మారలేదు. గెలుపు కోసం ప్రయత్నించడం ఆపలేదు. పదవి లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన పోరాటానికి తొమ్మిదో ప్రయత్నంలో ఫలితం దక్కింది. ఎనిమిది పరాజయాల తర్వాత సర్పంచిగా విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తొగూరుపేట పంచాయతీ పరిధిలోని చింతలకోన గ్రామానికి చెందిన కూటలగారి వెంకటయ్య ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు. సుమారు 40 ఏళ్ల క్రితమే గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. అయితే వరుసగా ఎనిమిదిసార్లు ఓటమి పలకరించింది. అయినప్పటికీ ఆయన ఎక్కడా కుంగిపోలేదు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు దూరం కావాల్సిన అవసరం లేదని భావించారు.
గెలుపోటములతో సంబంధం లేకుండా గ్రామస్థులతో అనుబంధాన్ని కొనసాగించారు. వారి సమస్యలను తెలుసుకుంటూ, కష్టసుఖాల్లో తోడుగా నిలిచారు. గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో తొమ్మిదోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈసారి గ్రామస్థులు ఆయనకు అండగా నిలిచారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న పట్టుదలకు గుర్తింపుగా ఓట్లు వేసి గెలిపించారు. ఏకంగా 372 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా విజయం అందించారు. ఎనిమిదిసార్లు ఓడినా తొమ్మిదోసారి గెలిచి చూపించిన వెంకటయ్య ప్రయాణం ఇప్పుడు చింతలకోనలో ఆసక్తికర చర్చగా మారింది. ఓటమి వచ్చిన ప్రతిసారీ వెనక్కి తగ్గకుండా, ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తే ఏదో ఒక రోజు గుర్తింపు దక్కుతుందనే దానికి వెంకటయ్య విజయం ఓ నిదర్శనంగా నిలిచింది.