
ఆపదమొక్కులవాడికి భక్తులు చెల్లించే మొక్కులు ఒక్కొక్కరివి ఒక్కో తీరు. ముడుపులు కట్టి, వడ్డి కాసులవాడికి మొక్కులు తీర్చుకోవడానికి రోజుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. అదివో అల్లదిగో అంటూ ఏడుకొండలవాడి దర్శనం కోసం కొండ మెట్లు ఎక్కే భక్తులు, అడుగడుగునా దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా గోవింద నామస్మరణతో తిరుమల యాత్ర చేసే భక్తులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక భక్తుడు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆయన వందల సార్లు నడక మార్గం ద్వారా కొండకు చేరుకుని అందరినీ ఆకట్టుకుంటున్నారు.
శ్రీకాకుళం SBI లైఫ్ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తున్న 59 ఏళ్ల మహతి శ్రీనివాసరావు సర్వేజనా సుఖినోభవంతు అనే దివ్య సంకల్పంతో ఈ తిరుమల యాత్రను కొనసాగిస్తున్నారు. తన 28వ ఏట నుంచి శ్రీవారి దర్శనం కోసం శ్రీకాకుళం నుంచి తిరుపతికి వస్తున్న శ్రీనివాసరావు. 1996 నుంచి 2016 వరకు 20 ఏళ్లలో 85 సార్లు, 2017లో 50 సార్లు, 2018లో 71 సార్లు, 2019లో 50 సార్లు అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమల యాత్ర చేశారు. ఇక కోవిడ్ సమయంలోనూ 2020లో రెండుసార్లు తిరుమల యాత్ర పూర్తి చేసిన శ్రీనివాసరావు 2021లో 52 సార్లు, 2022లో 57 సార్లు, 2023 లో 50 సార్లు, 2024లో 68 సార్లు శ్రీవారిని దర్శించుకునేందుకు నడక మార్గాల్లో కొండకు చేరినట్లు చెబుతున్నారు.
2026 నాటికి ఆయన మొత్తం 485 సార్లు కొండకు చేరుకున్నారు. 2025 ఫిబ్రవరి 13న గుండె జబ్బుతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న శ్రీనివాసరావు, ఆ తర్వాత కూడా వైద్యులు వద్దన్నా గోవిందుడు రమ్మన్నాడు అంటూ మరో ఆరుసార్లు తిరుమల యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. దీనితో ఆయన మొత్తం యాత్రల సంఖ్య 491 కి చేరింది. ఇందులో శ్రీవారి మెట్టు మార్గం ద్వారా 316 సార్లు, అలిపిరి మార్గం ద్వారా 175 సార్లు ఆయన కొండపైకి నడిచారు.
తనతో పాటు వేలాది మంది భక్తులను ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగస్వామ్యం చేయడం కోసం ఆయన “దక్షిణ భారతదేశ గోవిందా పాదయాత్ర” అనే వాట్సాప్ బృందాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది భక్తులను ఈ గ్రూప్‌లో చేర్చి, వారితో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో మెట్ల పూజోత్సవం నిర్వహిస్తున్నారు. 2022 మార్చి 9న అలిపిరి మార్గం ద్వారా 150 మంది భక్తులతో తొలి మెట్ల పూజోత్సవం ప్రారంభించారు. 2022 సెప్టెంబర్ 6న శ్రీవారి మెట్టు మార్గం ద్వారా 700 మంది భక్తులతో, 2023 ఏప్రిల్ 30న శ్రీవారి మెట్టు మార్గం ద్వారా 1008 భక్తులతో మెట్ల పూజోత్సవం చేశారు.
2024 జూలై 17న శ్రీవారి మెట్టు మార్గం ద్వారా 700 మంది భక్తులతో కలిసి పాదయాత్రతో మెట్ల పూజోత్సవం జరిపారు. ఇక 2025 ఏప్రిల్ 24 న 1025 మంది భక్తులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమల యాత్ర చేసి మెట్ల పూజోత్సవాన్ని పూర్తి చేశారు. 2026 జూలై 25 ఆరవసారి రాబోయే తొలి ఏకాదశి పర్వదినాన 2500 మంది భక్తులతో శ్రీవారి మెట్టు మార్గంలో భారీ మెట్ల పూజోత్సవం నిర్వహించనున్నారు.
ఇప్పటివరకు 491 సార్లు నడక మార్గంలో తిరుమల కొండకు వెళ్లిన శ్రీనివాసరావు గారు “ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్” లోనూ చోటు దక్కించుకున్నారు. తిరుమల యాత్రను కేవలం ఒక విహార యాత్రలా కాకుండా, భక్తిశ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక యాత్రగా చేయాలని ఆయన ఉపదేశిస్తున్నారు. ప్రతి భక్తుడూ తన జీవితంలో ఒక్కసారైనా తిరుమల కొండకు నడచి వెళ్లి స్వామివారికి మొక్కు చెల్లించుకోవాలని ఆయన భక్తులలో అవగాహన కల్పిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.