
అన్నమయ్య జిల్లాలోని పెద్దపాళ్యం సమీపంలో ఓ రైతు పొలంలో ఊహించని రీతిలో పురాతన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. పొలంలోని గుట్టను చదును చేయించాలని ఎక్స్‌కవేటర్‌ను రంగంలోకి దింపిన రైతుకు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించే దృశ్యం కనిపించింది. మట్టిపొరలను తొలగిస్తుండగా ఏకంగా 32 పురాతన నాగపడగ రాళ్లు బయటపడ్డాయి.
గ్రామానికి చెందిన వెంకటరమణ పొలంలో చాలా కాలంగా ఓ గుట్ట ఉండేది. ఇటీవల ఆ భూమిని చదును చేసుకోవాలని నిర్ణయించుకున్న వెంకటరమణ ఎక్స్‌కవేటర్ సహాయంతో గుట్టను తొలగించే పనులు చేపట్టాడు. అయితే మట్టిని తొలగిస్తున్న క్రమంలో ఒక్కొక్కటిగా నాగపడగ ఆకారంలో చెక్కిన పురాతన రాళ్లు బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు మొత్తం 32 రాళ్లు వెలుగులోకి వచ్చాయి.
ఈ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. పురాతన నాగపడగ రాళ్లను చూసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ రాళ్లకు ప్రత్యేకంగా గుడి నిర్మించి ప్రతిష్ఠించాలని ఓ పురోహితుడు రైతు వెంకటరమణకు సూచించినట్లు సమాచారం.
అయితే గుడి నిర్మించే వరకు రాళ్లను జాగ్రత్తగా భద్రపరచాలని, పెద్దపాటి గుంతను తీసి అందులో నీటిని నింపి నాగపడగ రాళ్లను ఉంచాలని పురోహితుడు సూచించాడు. దీంతో రైతు ప్రస్తుతం అవి బయటపడిన ప్రాంతంలోనే ఎక్స్‌కవేటర్ సహాయంతో పెద్ద గుంత తవ్వించే పనులు చేపట్టాడు.
సాధారణంగా కనిపించిన పొలం గుట్టలో ఇన్ని పురాతన నాగపడగ రాళ్లు బయటపడటం ఇప్పుడు పెద్దపాళ్యం పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రాళ్లు ఏ కాలానికి చెందినవి? వాటి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? అన్న ప్రశ్నలు స్థానికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తే ఈ అరుదైన రాళ్ల వెనుక ఉన్న అసలు చరిత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.