మురుగు కాలువ కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. చుట్టలు చుట్టలుగా..

కాలువలో బుసలు కొడుతున్న భారీ గిరినాగు.. వింత శబ్దాలతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సుమారు పదిహేను అడుగుల పొడవున్న పామును గుర్తించిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆపరేషన్‌లో చివరకు గిరినాగును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టడంతో గ్రామంలో ఊపిరి పీల్చుకున్నారు.

మురుగు కాలువ కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. చుట్టలు చుట్టలుగా..
Village Panic

Edited By:

Updated on: Apr 10, 2026 | 1:19 PM

విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి గ్రామంలో ఓ భారీ పాము గ్రామస్థులను భయాందోళనకు గురిచేసింది. వెలమల వీధిలోని మురికి కాలువలో సుమారు పదిహేను అడుగుల పొడవు ఉన్న గిరినాగు తిష్ట వేసి బుసలు కొట్టడం ప్రారంభించింది. కాలువలో నుంచి వస్తున్న వింత శబ్దాలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమీపంలో ఉన్న కొందరు ధైర్యం తెచ్చుకొని కాలువ దగ్గరికి వెళ్లి చూడగా సుమారు పదిహేను అడుగుల పొడవున్న గిరినాగు కనిపించింది. దీంతో వెంటనే ఇతర గ్రామస్తులకు సమాచారం అందించారు. అలా కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు.

పాము కదలికలు గమనించిన గ్రామస్తులు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. సరైన పరికరాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ గిరినాగును పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గిరి నాగు స్నేక్ క్యాచర్‌ను సైతం ముప్పు తిప్పలు పెట్టింది. ఆ భారీ పాము బుసలు కొడుతూ అటూ ఇటూ వెళ్లే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో గిరి నాగు ప్రవర్తించిన తీరు గ్రామస్తులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. కానీ స్నేక్ క్యాచర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి కొంత సమయం పాటు శ్రమించిన తరువాత ఎట్టకేలకు గిరినాగును సురక్షితంగా పట్టుకుని సంచిలో వేశాడు. అనంతరం ఆ గిరినాగును సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి సహజ వాతావరణంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా సకాలంలో స్పందించిన స్నేక్ క్యాచర్‌ను స్థానికులు అభినందించారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, చివరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊరట చెందారు.

Also Read: ప్రామిసరీ నోట్‌లో ఈ తప్పులు చేస్తే మీ డబ్బులు వదిలేసుకోవడమే.. 

Follow Us