
116 ఏళ్ల వయసులోనూ శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలు నవనీతమ్మకు టీటీడీ ప్రత్యేక అవకాశం కల్పించింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించిన బీఆర్ నాయుడు.. ఈ వయసులోనూ నవనీతమ్మ చూపించిన భక్తి, సంకల్పం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆమెకు శ్రీవారి ఆశీస్సులు లభించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పించడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు.
శనివారం అలిపిరి నడక మార్గం ద్వారా నవనీతమ్మ తిరుమలకు చేరుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే తొలుత ఆమె వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో కర్ణాటకకు చెందిన భక్తురాలిగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడు స్వయంగా స్పందించి, వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు టీటీడీని సంప్రదించాలని కోరారు. అనంతరం తితిదే విజిలెన్స్ సిబ్బంది విచారణ చేపట్టి, ఆమె తమిళనాడుకు చెందిన నవనీతమ్మ అని గుర్తించారు. ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల వద్ద ఉంటున్నట్లు నిర్ధారించారు. వృద్ధురాలి వివరాలు కన్ఫామ్ అయిన వెంటనే ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. నవనీతమ్మ భక్తి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా భక్తుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..