నేనే మీ చట్టాన్ని.. నా మాటే శాసనం.. డొనాల్డ్ ట్రంప్

| Edited By: Pardhasaradhi Peri

Jun 02, 2020 | 3:25 PM

ఆఫ్రికన్-అమెరికన్ దారుణ హత్యకు నిరసనగా అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు తమ ర్యాలీలను ఉధృతం చేస్తున్నారు...

నేనే మీ చట్టాన్ని.. నా మాటే శాసనం.. డొనాల్డ్ ట్రంప్
Follow us on

ఆఫ్రికన్-అమెరికన్ దారుణ హత్యకు నిరసనగా అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు తమ ర్యాలీలను ఉధృతం చేస్తున్నారు. అనేక నగరాల్లో లూటీలకు, విధ్వంసానికి పాల్పడుతూనే ఉన్నారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్దే వారు పోలీసులతో ఘర్షణకు దిగడంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహించారు. ‘నేనే మీ చట్టాన్ని.. నా మాటే శాసనం’ అంటూ.. అల్లర్లను అణచివేయడానికి సాయుధులైన సైనికులను దేశవ్యాప్తంగా తరలిస్తానని హెచ్చరించారు. లూటీలు, ఘర్షణలకు పాల్పడుతున్న వారికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. వైట్ హౌస్ వద్ద నిరసనకారులు ధ్వంసం చేసిన సెయింట్ జాన్స్ చర్చిని విజిట్ చేసిన ట్రంప్.. అక్కడ చేతిలో బైబిల్ పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చారు.

అనంతరం గవర్నర్లు, నేషనల్ సెక్యూరిటీ అధికారులు, పోలీసులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన… ముఖ్యంగా గవర్నర్లపై విరుచుకపడ్డారు. మీరు అల్లర్లను అదుపు చేయాల్సిందే.. లేని పక్షంలో జోకర్లుగా మిగిలిపోతారు అని కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. మన దేశ ప్రజలను ఎలా రక్షించుకోవాలో తనకు తెలుసునని, శాంతి కాముకులైన ప్రజలను కొంతమంది రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.