దుబ్బాకలో జోరందుకున్న రాజకీయ పార్టీల ప్రచారం

దుబ్బాక ఉప ఎన్నిక పోరులో రాజకీయపార్టీల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అధికార, విపక్షపార్టీల నేతలు హోరాహోరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:03 am, Fri, 30 October 20

దుబ్బాక ఉప ఎన్నిక పోరులో రాజకీయపార్టీల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అధికార, విపక్షపార్టీల నేతలు హోరాహోరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పరస్పర ఆరోపణలతో వాతావరణం మరింత హీటెక్కించారు. గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన దుబ్బాక స్థానంలో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుండగా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి.

ఇటు, దుబ్బాక ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యల చేశారు. దుబ్బాక గెలుపు ఎప్పుడో డిసైడ్‌ అయ్యిందని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ ప్రారంభోత్సవం తర్వాత… ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. దుబ్బాక ఎన్నికలు టీఆర్ఎస్‌కు పెద్ద లెక్కే కాదని.. మంచి మెజార్టీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. చిల్లర తతంగాలు నడుస్తునే ఉంటాయి.. వాటిని పట్టించుకోమని స్పష్టం చేశారు. గ్రౌండ్‌ చాలా క్లియర్‌గా ఉందని వ్యాఖ్యానించారు.

దుబ్బాక ఉప ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు సరోజ్‌ కుమార్ ఠాకూర్‌ను సిద్దిపేటలో కలిశారు BJP నాయకులు. స్థానిక పోలీసులపై, టీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు రూల్స్‌ని బ్రేక్‌ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఠాకూర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏదైనా సమస్యలు తలెత్తితే ప్రజలు 94454-37356 నంబర్‌కి కాల్ చేయాలని పోలీస్‌ స్పెషల్ ఆఫీసర్‌ సరోజ్‌కుమార్‌ ఠాకూర్‌ సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.

అటు, దుబ్బాకలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయ్‌. మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్‌,బీజేపీలపై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవాళ్లని..ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని హరీష్‌రావు అన్నారు. 20 వేల నుంచి లక్ష వరకు వ్యవసాయ రుణాల్ని రద్దుచేస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని, కరోనా వల్ల ఆలస్యమైందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పైసలు, సీసాలను నమ్ముకున్నారని, టీఆర్‌ఎస్‌..అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకుందని హరీష్‌రావు అన్నారు.

మరోవైపు, అన్ని పార్టీల ముఖ్యనేతలందరూ దుబ్బాకలో మకాం వేసి అయాపార్టీల అభ్యర్థుల గెలుపు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు దుబ్బాకలో బీజేపీ సీనియర్‌ నేత….కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పర్యటిస్తారు. ఉదయం 11 గంటల నుండి 12.30 వరకు భుమ్‌పల్లి ఎక్స్‌ రోడ్‌ వద్ద నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒకటిన్నరకు సిద్దిపేట సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు దుబ్బాక సభలో ప్రసంగిస్తారు. 6గంటల నుంచి ఏడు గంటల వరకు తిమ్మాపూర్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు.

దుబ్బాకలో ఇన్నాళ్లుగా అభివృద్ధే జరగలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారాయన. అధికార పార్టీపై విమర్శలు చేసిన బండి సంజయ్.. ఓటర్లు తెలివైనవారని అన్నారు. డబ్బు ఎవరిచ్చినా.. ఓటు మాత్రం బీజేపీకే అంటూ ధీమా వ్యక్తంచేశారు.

కాంగ్రెస్‍ పార్టీ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‍రెడ్డిని బరిలోకి దింపింది. ఉప ఎన్నికల్లో టీఆర్‍ఎస్‍ టికెట్‍ ఆశించి భంగపడ్డ శ్రీనివాస్‍రెడ్డి కాంగ్రెస్‍లో చేరారు. అనంతరం వేగంగా పావులుకదిపడంతో దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాస్‍రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ పీసీసీ ఏఐసీసీకి లేఖ పంపింది. శ్రీనివాస్ రెడ్డి తరుపున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా సీనియర్ పార్టీ నేతలంతా ప్రచారంలో దూకుడు పెంచారు.