
యూకేలో డిగ్రీ లేదా ఇతర ఉన్నత విద్యా కోర్సులు పూర్తిచేసిన అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసా ద్వారా అక్కడే ఉండి ఉద్యోగ అనుభవం పొందవచ్చు. ఈ రెండేళ్ల వీసా ప్రయోజనం పొందాలంటే విద్యార్థులు కొన్ని అర్హతలు కలిగిన యూనివర్సిటీల్లో చదివి ఉండాలి. వీసా నిబంధనలు, ఇతర ప్రభుత్వ మార్గదర్శకాలను సక్రమంగా పాటించే యూనివర్సిటీ అయి ఉండాలి. ఆ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తుండాలి.
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించేందుకు బ్రిటన్ ప్రభుత్వం తన వలస విధానాల్లో మార్పులు చేస్తోంది. తక్కువ, మధ్యస్థ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తూనే అత్యున్నత ప్రతిభ కలిగిన అంతర్జాతీయ నిపుణులకు అవకాశాలను మెరుగుపరుస్తోంది. 2025 బడ్జెట్ తర్వాత గ్లోబల్ టాలెంట్ వీసాలో కూడా మార్పులు చేసింది. ఈ వీసాలోని ఎండోర్స్డ్ ఫండర్ మార్గాన్ని విస్తరించింది. దీంతో పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పనిచేసే 100కు పైగా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు బ్రిటన్‌లో పనిచేసే అవకాశాలు కల్పిస్తున్నాయి. అలాగే హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ (HPI) వీసా పరిధిని కూడా విస్తరించింది. ప్రపంచంలోని టాప్ 150 ర్యాంకింగ్స్‌లో ఉన్న విద్యాసంస్థల నుంచి అర్హత కలిగిన డిగ్రీలు పొందిన వారికి ఈ వీసా ద్వారా అవకాశాలు కల్పిస్తోంది. ఈ పథకం కింద వీసాల పరిమితిని కూడా పెంచింది.
బ్రిటన్‌లో చదువుకోవాలని భావించే భారతీయ విద్యార్థులకు అక్కడ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసుకునే అవకాశం చాలా కీలకం. విదేశాల్లో చదువుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న విద్యార్థులు, ఆ తర్వాత అంతర్జాతీయ ఉద్యోగ అనుభవం పొందాలని ఆశిస్తుంటారు. రెండేళ్ల గ్రాడ్యుయేట్ వీసా కొనసాగింపు నిర్ణయం భారతీయ విద్యార్థులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఫతే ఎడ్యుకేషన్ సీఈఓ సునీత్ సింగ్ కొచర్ మాట్లాడుతూ.. యూకే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు. చదువు పూర్తయిన తర్వాత విదేశాల్లో పనిచేసే అవకాశం ఉండటం అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే ముఖ్యమైన అంశమని అన్నారు.విద్యార్థులు యూనివర్సిటీలను ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం ర్యాంకింగ్స్ మాత్రమే కాకుండా, అక్కడ చదివిన వారికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి? పరిశ్రమలతో ఆ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వంటి అంశాలను కూడా పరిశీలించాలని సూచించారు.
మానిఫెస్ట్ గ్లోబల్ సంస్థకు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాగర్ బహదూర్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రపంచ దేశాల మధ్య పోటీ పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో యూకే తీసుకున్న నిర్ణయం కీలకమని అన్నారు.అయితే హై-కంప్లయన్స్ యూనివర్సిటీలు, మంచి ఉద్యోగ ఫలితాలు సాధించిన విద్యాసంస్థలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రమాణాలను ప్రకటించాలని చెప్పారు. ఈ నిబంధనలు పారదర్శకంగా, అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.
యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ డిప్యూటీ ప్రో వైస్ ఛాన్సలర్ మార్క్ లీ మాట్లాడుతూ.. కొత్త విధానం అంతర్జాతీయ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అనుభవం పొందడం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
అయితే వీసా అర్హతలు, యూనివర్సిటీల ఎంపిక, ఉద్యోగ అవకాశాలను అంచనా వేసే విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, వారి కుటుంబాలు భారీగా డబ్బు ఖర్చు చేసి విదేశాలకు వెళ్తున్నందున ముందుగానే సరైన సమాచారం అందుబాటులో ఉండాలని చెప్పారు.
అక్యుమెన్ సంస్థకు చెందిన సౌత్ ఆసియా సీనియర్ డైరెక్టర్ రీతూ శర్మ కూడా ఈ నిర్ణయం భారతీయ కుటుంబాలకు సానుకూల సంకేతమని అన్నారు. భారతీయ విద్యార్థులు యూకేను ఎంచుకోవడంతో పాటు ఏ యూనివర్సిటీలో చేరాలనే విషయంలోనూ మరింత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌తో పాటు వీసా నిబంధనల అమలు, చదువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
మొత్తంగా చూస్తే.. యూకేలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం మంచి అవకాశంగా కనిపిస్తోంది. అయితే రెండేళ్ల గ్రాడ్యుయేట్ వీసా ప్రయోజనం అన్ని యూనివర్సిటీల విద్యార్థులకు కాకుండా, ప్రభుత్వం నిర్దేశించే అర్హతలు కలిగిన విద్యాసంస్థల్లో చదివిన వారికే వర్తిస్తుంది. కాబట్టి విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకునే ముందు యూనివర్సిటీ అర్హతలు, వీసా నిబంధనలు, ఉద్యోగ అవకాశాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.