
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ టారిఫ్ బెత్తం పట్టుకుంటున్నారు. సుంకాల పేరుతో భారత్ సహా పలు దేశాలకు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు విధించిన సుంకాలు చాలవన్నట్టు కొత్త టారిఫ్ లిస్ట్ రెడీ చేయడం కలకలం రేపుతోంది. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్‌తో పాటు మరో 14 దేశాలపై అదనపు దిగుమతి సుంకాలు విధించేందుకు ట్రంప్ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నట్టు ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. అయితే.. టారిఫ్ బాదుడుకు సంబంధించి ట్రంప్ యంత్రాంగం కొత్త రాగం ఎత్తుకుంది. ఆయా దేశాలు తమ పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తుండటంతో.. తక్కువ ధరకే అంతర్జాతీయ మార్కెట్లోకి ఉత్పత్తులు వస్తున్నాయని.. దీనివల్ల అమెరికా తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ట్రంప్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు.
వాస్తవానికి.. గతంలో ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో.. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద మార్చి 11న 16 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విచారణ చేపట్టింది. నెలల తరబడి సాగిన ఈ విచారణ తుది నివేదికను ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాలో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్‌లోని 14 దేశాలు ఉన్నాయి. వీటితో పాటు జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, మెక్సికో, తైవాన్, బంగ్లాదేశ్, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయిలాండ్ లాంటి దేశాలు ఉన్నాయి. అయితే.. ఒకవైపు వాణిజ్య ఒప్పందాలంటూనే.. మరోవైపు సుంకాల కత్తి ఝుళిపిస్తున్న అమెరికా వైఖరిపై ఆయా దేశాల వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం వాణిజ్య ఒప్పందాల ప్రకారం EU, జపాన్, దక్షిణ కొరియాలపై సుంకాలు 15 శాతం లోపు ఉండే అవకాశం ఉంది. భారత్, వియత్నాంపై అంతకంటే ఎక్కువ సుంకాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ప్రత్యేక సుంకాలు ఎదుర్కొంటున్న ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ రంగాలకు వీటి నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే.. జూలైలో విధించిన 10 నుంచి 12.5 శాతం సుంకాలకు తోడుగా ఈ కొత్త బాదుడు ఉండనుండటంతో.. ఈ వారంలోనే వెలువడనున్న అమెరికా అధికారిక ప్రకటనపై భారత ఎగుమతి రంగాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా.. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్న వేళ ట్రంప్ విసురుతున్న ఈ టారిఫ్ బాణాలు.. ట్రేడ్ వార్‌కు మళ్లీ ఆజ్యం పోసేలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. వారంలోనే రిలీజ్ అయ్యే USTR ఫైనల్ రిపోర్ట్‌లో భారత్‌తో పాటు.. ఆయా దేశాలపై టారిఫ్‌ల భారం ఎంత వరకు పడుతుంది?.. ట్రంప్ టారిఫ్‌ల వ్యవహారంపై బాధిత దేశాలన్నీ ఎలా రియాక్ట్ అవుతాయనేది ఆసక్తి రేపుతోంది.