Afghanistan Crisis: వ్యతిరేకులకు క్షమాభిక్ష పెట్టిన తాలిబన్లు.. ప్రభుత్వంలో చేరాలంటూ మహిళలకు పిలుపు..

|

Aug 17, 2021 | 4:44 PM

Afghanistan Crisis: తమకు వ్యతిరేకంగా పని చేసిన ఆఫ్గాన్లందరికీ తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటించారు. అంతేకాదు.. ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వంలో చేరాలిన మహిళలను తాలిబన్లు కోరారు.

Afghanistan Crisis: వ్యతిరేకులకు క్షమాభిక్ష పెట్టిన తాలిబన్లు.. ప్రభుత్వంలో చేరాలంటూ మహిళలకు పిలుపు..
Thaliban
Follow us on

Afghanistan Crisis: తమకు వ్యతిరేకంగా పని చేసిన ఆఫ్గాన్లందరికీ తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటించారు. అంతేకాదు.. ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వంలో చేరాలిన మహిళలను తాలిబన్లు కోరారు. ఆఫ్గన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ కల్చర్ కమిషన్ సభ్యుడు ఎనాముల్లా సమంగాని మంగళవారం నాడు తాలిబన్ల చేతిలో ఉన్న ఆఫ్గన్ స్టేట్ టీవీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ ఎమిరేట్ మహిళలు బాధపడాలని కోరుకోవడం లేదని ఆయన అన్నారు.

ఆఫ్గనిస్తాన్ కోసం తాలిబన్లు ఇస్లామిక్ ఎమిరేట్‌ను ఏర్పాటు చేస్తుందని సమంగాని ప్రకటించారు. ‘‘ప్రభుత్వం నిర్మాణం పూర్తిగా స్పష్టం లేదు. కానీ మా అనుభవాన్ని ఉపయోగించి పాలన సాగిస్తాం. ఆఫ్గనిస్తాన్‌లో పూర్తి ఇస్లామిక్ నాయకత్వం ఉండాలి. ప్రజలందరూ ఈ ప్రభుత్వంలో భాగస్వాములవ్వాలి. ప్రజలు తిరిగి ప్రభుత్వంలో చేరాలి. ముఖ్యంగా మహిళలు తాలిబన్ ప్రభుత్వంలో చేరవచ్చు. టీవీ ఛానెళ్లలో మహిళా వార్తా ప్రెజెంటర్ చూపించే వార్తలపైనా ఎలాంటి అభ్యంతరం లేదు.’’ అని సమంగాని ప్రకటించారు. అయితే, ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల హస్తగతం అయినప్పటి నుంచి ఆదేశంలో భయానక వాతావరణం నెలకొంది. తాలిబన్ల పాలన భరించడం కంటే పారిపోవడం ఉత్తమం అని ఆ దేశ ప్రజలు విదేశాల ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఆఫ్గన్ వాసుల్లో భయాందోళనలు..
కాగా, ఆఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న మరుసటి రోజు నుంచే తాలిబన్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. రాజధాని కాబూల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఎన్జీవో సిబ్బంది.. భద్రతాసిబ్బంది, జర్నలిస్టులను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నారు. తాలిబన్లను వ్యతిరేకంగా పని చేసిన 80 మంది ఆఫ్గన్‌ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు కాబూల్‌ వాసులు. గతంలో తాలిబాన్ల పాలనను గుర్తుచేసుకున్న అక్కడి ప్రజలు.. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు తాలిబన్ల పాలన భరించలేం అంటూ దేశం విడిచి పారిపోతున్నారు. ఫలితంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టులో భయంకరమైన వాతావరణం నెలకొంది. విమానాల్లో చోటు లేకపోవడంతో వాటి టైర్లు పట్టుకొని కొందరు ప్రయాణం చేసే ప్రయత్నం చేశారు. ఇంకొందరు విమానం రెక్కలు పట్టుకొని ప్రయాణించే ప్రయత్నం చేశారు. కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం నుంచి ముగ్గురు కిందపడిపోయారు.

తాలిబన్లకు బైడెన్ వార్నింగ్..
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలపై మౌనం వీడారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌. తమ బలగాల ఉపసంహరణను పూర్తిగా సమర్థించుకున్నారాయన. ఈ నిర్ణయం గత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో తీసుకున్నదేనని స్పష్టం చేశారు. ఆఫ్గన్‌ పరిణామాలు తనకు బాధ కలిగిస్తున్నాయన్నారు. అఫ్గాన్​లోని ప్రస్తుత పరిణామాలు.. విచారకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రజలకు అమెరికా మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ప్రాంతీయ దౌత్యం కోసం, ఆఫ్ఘన్‌ హక్కుల కోసం పాటుపడుతుందన్నారు. ప్రస్తుతం అఫ్ఘన్‌లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు జోబైడెన్‌ చెప్పారు. ఇక అమెరికా సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదని, ప్రతీకారం తీర్చుకుంటుందని తాలిబన్లను.. జో బైడెన్ హెచ్చరించారు. అటు తమ దేశంలో తిరిగి తాలిబన్లు పాగా వేసేందుకు అధ్యక్షుడు జో బైడెనే కారకుడని అమెరికాలో స్థిరపడ్డ ఆఫ్ఘన్‌ వాసులు ఆరోపించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ముందు వందలాది మంది నిరసనకు దిగారు. అఫ్ఘాన్లను బైడెన్‌ మోసం చేశారని ఆగ్రహం వెళ్లగక్కారు.

Also read:

Aadhar update: ఆధార్ అప్డేట్ ఆదేశాలు.. రోజుల తరబడి సెంటర్ల చుట్టూ క్యూలు కడుతోన్న జనాలు

Rao Ramesh: ఏంటీ.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కు ఇంత రెమ్యునరేషనా..? షాక్‌కు గురిచేస్తున్న రావు రమేష్‌ పారితోషకం వార్త.

Postal Life Insurance: తక్కువ పెట్టబడితో ఎక్కువ భద్రత.. పోస్టాఫీసులో అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్..