
Panama Earthquake Telugu: పనామాలో శుక్రవారం (అక్టోబర్ 9, 2026) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం రాజధాని పనామా సిటీతో పాటు పలు ప్రాంతాలను వణికించింది. భవనాలు కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాల్లో గుమిగూడారు. పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి.
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. హెర్రెరా ప్రావిన్స్‌లోని పిటాలోజా అర్రిబా సమీపంలో భూకంప కేంద్రం నమోదైంది. భూమికి సుమారు 12.6 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లో భవనాలు, రహదారులు దెబ్బతిన్నట్లు సమాచారం.
భూకంపం తీవ్రతకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షాపింగ్ మాల్స్‌లో ఉన్న ప్రజలు సైతం భయంతో బయటకు పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. పనామా సిటీలోని టౌన్ సెంటర్ మాల్‌లోనూ ప్రజలు భవనం నుంచి బయటకు వచ్చినట్లు వీడియోల్లో వెల్లడైంది.
ప్రధాన భూకంపం తర్వాత 40కి పైగా ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఇద్దరు మరణించారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భూకంపం కారణంగా జరిగిన నష్టం, ఇతర ప్రభావాలపై అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
తొలుత ఈ భూకంపం తీవ్రత 8.0గా నమోదైనప్పటికీ.. అనంతరం అమెరికా జియోలాజికల్ సర్వే దానిని 7.7గా సవరించింది. సహాయక చర్యలు, నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతోంది.
వీడియో చూడండి..