
ఓ వైపు సింధు జలాల ఒప్పందం నిలిచిపోవడం.మరోవైపు పీక్ సమ్మర్ కారణంగా పాకిస్తాన్ రాజధాని కరాచీలో నీటి కొతర స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. కరాచీలో సుమారు 3 కోట్ల మంది తీవ్రమైన నీటి సంక్షోభంతో అల్లాడుతున్నారు. సింధు జలాల ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభన దాయాది దేశం పాలిట ప్రాణసంకటంగా మారుతోంది. అయితే నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న ఈ నీటి సంక్షోభానికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఘోరమైన పరిపాలనా వైఫల్యమే కారణమంటూ ‘జమాత్-ఎ-ఇస్లామీ పాకిస్తాన్’ చీఫ్ హఫీజ్ నయీమ్ ఉర్ రెహ్మాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ, కరాచీ పౌరుల ప్రాథమిక నీటి అవసరాలను తీర్చడంలో పీపీపీ నేతృత్వంలోని సింధ్ ప్రాంతీయ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జమాత్ ఆరోపించారు.
ఈద్ సందర్భంగా హఫీజ్ నయీమ్ మాట్లాడుతూ.. నగరంలో పౌరసత్వ సవాలులు, నీటి కొరత ఉన్నప్పటికీ కరాచీ ప్రజలు తమ మతపరమైన సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజలతో తమ పార్టీ బంధాన్ని బలోపేతం చేసేందుకు గానూ కరాచీవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో జమాత్-ఎ-ఇస్లామీ సామూహిక ఖుర్బానీ ఏర్పాట్లను నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పండుగ దినాల్లో కూడా వేలాది మంది నివాసితులు కనీస అవసరాలైన తాగునీటి కోసం అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 18 ఏళ్లుగా సింధ్ ప్రావిన్స్‌ను పాలిస్తున్న పీపీపీ ప్రభుత్వం, కరాచీ నీటి సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కరాచీలో నీటి కష్టాలు ఎందుకు?
దశాబ్దాల క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఒప్పందం అమలు విషయంలో ఇరు దేశాల మధ్య కొంత కాలంగా తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడంలో పాకిస్తాన్ వైఖరి వల్ల చర్చలు ముందుకు సాగడం లేదు. దీని ఫలితంగా ఆ దేశంలోని ప్రధాన నగరాలకు నీటి సరఫరా దారుణంగా పడిపోయింది.
సింధు నదిపై భారత్ నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో పాకిస్తాన్ పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో తమ దేశంలో నీటి వనరులను కాపాడుకోవడంలో మాత్రం అక్కడి పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. నదీ జలాల నిర్వహణ సరిగా లేకపోవడంతో కరాచీ లాంటి మహానగరాలు ఇప్పుడు ఎడారులను తలపిస్తున్నాయి.
కరాచీ నగరానికి ప్రతిరోజూ కోట్లాది లీటర్ల నీరు అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం అందులో సగం కూడా సరఫరా కావడం లేదు. దీంతో నగరవాసులు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. భారీగా డబ్బులు చెల్లించి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కుందామన్నా దొరకని దయనీయ పరిస్థితి అక్కడ నెలకొంది.
నగరంలో ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో జనం రోడ్లపై బారులు తీరుతున్నారు. నీటి కోసం కరాచీ వీధుల్లో ప్రతిరోజూ చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి. నీటి కొరత వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. రోజువారీ పనులకు కూడా నీరు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సింధు జలాల ఒప్పందంపై భారత్తో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఒప్పందం ప్రకారం దక్కాల్సిన నీటిని వాడుకోవడంలో పాకిస్తాన్ కు ఎలాంటి ప్రణాళిక లేదు. ఏళ్లు గడుస్తున్నా కొత్త ప్రాజెక్టులు నిర్మించకపోవడం ఈ భారీ జల సంక్షోభానికి ప్రధాన కారణంగా మారుతోంది.
రాజకీయ అస్థిరత ఆర్థిక మాంద్యంతో ఇప్పటికే సతమతమవుతున్న పాకిస్తాన్ కు ఈ నీటి కష్టాలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గడం కూడా అక్కడి పరిస్థితిని మరింత దిగజార్చింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కరాచీ ప్రజలకు దాహం తీర్చుకోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా పరిణమించింది.
ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే పాకిస్తాన్ తన మొండి వైఖరిని వీడాల్సిందే. అనవసర వివాదాలను పక్కనపెట్టి జల వనరుల సమర్థ నిర్వహణపై దృష్టి పెట్టకపోతే మున్ముందు కరాచీ పూర్తిగా నీరు లేని నగరంగా మారే ప్రమాదం పొంచి ఉంది. పాలకుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.