
ఎన్విడియా (Nvidia) కంపెనీ పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఆ సంస్థ సీఈఓ జెన్సెన్ హువాంగ్ కు చైనాకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్తతో వివాహేతర సంబంధం ఉందని ఆమె చైనా నిఘా సంస్థల కోసం పనిచేస్తున్నారనీ అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి. ఆమెకు సంబంధం ఉన్న మెగాస్పీడ్ సంస్థ రెండేళ్లలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా చిప్స్ కొనుగోలు చేయడం ఏంటని అక్కడే అసలు అనుమానం వస్తోందని తెలిపింది.
‘నేను నా భార్యకు ద్రోహం చేశాను. నా చర్యల వల్ల ఆమె, నా పిల్లలు బాధపడ్డారు. నేను చేసిన పనికి ఎలాంటి సాకులు చెప్పలేను. నా ప్రవర్తనకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’ అని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో జెన్సెన్ హువాంగ్ స్పష్టం చేశారు. ఎన్విడియా ఉద్యోగులు, డైరెక్టర్ల బోర్డు, వాటాదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తుచేశారు. వారి విశ్వాసాన్ని పొందడంలో తాను విఫలమయ్యానని, కంపెనీకి పూర్తిగా కట్టుబడి ఉన్నానని, అందరి నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆలిస్ హువాంగ్. జెన్సెన్ హువాంగ్‌తో ఆమెకు ఎలాంటి కుటుంబ సంబంధం లేదు. ఇద్దరి ఇంటిపేర్లు ఒకటే అయినప్పటికీ బంధువులు కారు. చైనాకు చెందిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ఆలిస్ హువాంగ్ సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ (Megaspeed) అనే డేటా సెంటర్ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఆమెకు జెన్సెన్ హువాంగ్‌తో సన్నిహిత పరిచయం ఏర్పడింది.
2024 లో తైవాన్‌లో జరిగిన ఓ పార్టీలో జెన్సెన్ హువాంగ్ పక్కన ఆలిస్ హువాంగ్ కూర్చున్న ఫొటో వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె వ్యాపారవేత్త మాత్రమేనా లేక చైనా నిఘా వర్గాలతో సంబంధాలు ఉన్నాయా? ఆమె జెన్సెన్ హువాంగ్‌తో ఏర్పడిన పరిచయాన్ని ఉపయోగించి చైనా కోసం కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారనీ అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి.
మెగాస్పీడ్ సంస్థ రెండేళ్ల వ్యవధిలో ఎన్విడియా నుంచి 4.8 బిలియన్ డాలర్లకు పైగా విలువైన AI చిప్స్ కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.40 వేల కోట్లకు పైమాటే. ఇంత భారీ మొత్తంలో కొనుగోలు చేసిన చిప్స్‌ను ఎక్కడ ఉపయోగిస్తున్నారు? వినియోగదారులు ఎవరు? అమెరికా ఎగుమతి ఆంక్షలను ఉల్లంఘించి చైనాకు తరలించే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
అత్యాధునిక ఏఐ చిప్స్ చైనాకు చేరకుండా అమెరికా ప్రభుత్వం 2022 నుంచి కఠినమైన ఎగుమతి ఆంక్షలు అమలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్పీడ్ కొనుగోళ్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఆరోపణలను ఎన్విడియా ఖండించింది. మెగాస్పీడ్తో తమ వ్యాపార సంబంధాలు సాధారణమే అని జెన్సెన్ హువాంగ్ తెలిపారు. ఆ సంస్థ తమ చిప్ లను ఎక్కడ, ఎలా ఉపయోగిస్తోందో పరిశీలించామని, చట్టవిరుద్ధంగా చైనాకు చిప్స్ తరలించినట్లు గుర్తించలేదని స్పష్టం చేసారు.
ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ముందుగానే సమాచారం అందిందని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఆలిస్ హువాంగ్‌పై అనుమానంతో సేకరించిన వివరాలను ట్రంప్‌కు ఏడాది ముందే అమెరికా నిఘా వర్గాలు తెలియచేసాయి.
ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు రావడంతో అమెరికాలో జాతీయ భద్రతపై చర్చ మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఏఐ చిప్స్ తయారు చేసే సంస్థ అధినేతకు విదేశీ నిఘా సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి సన్నిహితంగా ఉండటం వ్యక్తిగత వ్యవహారంగా చూడలేమని అమెరికా కాంగ్రెస్ అంటోంది.
ఈ వ్యవహారాన్ని అమెరికా కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ముగ్గురు కమిటీ అధ్యక్షులు నవంబర్ 4న జెన్సెన్ హువాంగ్‌కు లేఖ రాశారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందా, అత్యంత కీలకమైన అమెరికా సాంకేతిక పరిజ్ఞానం చైనాకు చేరే అవకాశం ఉందా, వీటిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎన్విడియా చిప్స్ విక్రయాల్లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, విదేశీ నిఘా సంస్థలు కంపెనీ అధికారులను లక్ష్యంగా చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, వంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు కోరారు. నవంబర్ 18న క్లోజ్డ్ డోర్ సమావేశంలో తమకు వివరాలు వెల్లడించాలని లేఖలో పేర్కొన్నారు.
అమెరికా కాంగ్రెస్ విచారణకు సిద్ధమవుతుండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెన్సెన్ హువాంగ్‌కు మద్దతుగా నిలిచారు. ఆయన మంచి వ్యక్తి అని తనకు తెలుసనీ అయితే తెరవెనుక ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని వ్యాఖ్యానించారు. అమెరికా కోసం హువాంగ్ అద్భుతమైన పని చేశారని ప్రశంసించారు. గతంలోనే నిఘా ఆరోపణలపై సమాచారం అందినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించగా, జెన్సెన్ హువాంగ్ గౌరవప్రదమైన వ్యక్తి అని, ఆయనపై తనకు నమ్మకం ఉందని ట్రంప్ సమాధానమిచ్చారు. చైనా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఎన్విడియా సీఈఓను లక్ష్యంగా చేసుకుని తమ దేశం గూఢచర్యానికి పాల్పడిందన్న వార్తల్లో వాస్తవం లేదని, అవి ఆధారాలు లేని ఊహాగానాలని పేర్కొంది.
ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర విచారణ ప్రారంభించింది. విచారణకు సహకరిస్తానని జెన్సెన్ హువాంగ్ బోర్దుకు హామీ ఇచ్చారు. అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన వివరాలు బయటకు వెళ్లినట్లు ఆధారాలు లేవని కంపెనీ బోర్డు స్పష్టం చేసింది.
ఓపెన్ఏఐ, మెటా వంటి దిగ్గజ సంస్థలు ఎన్విడియా చిప్స్‌పై ఆధారపడుతున్నాయి. 1993లో ఎన్విడియాను సహ-స్థాపించిన జెన్సెన్ హువాంగ్ఒ కప్పుడు గేమింగ్ కోసం తయారు చేసిన గ్రాఫిక్స్ టెక్నాలజీని ఏఐ కంప్యూటింగ్ వైపు మళ్లించారు. దీంతో కంపెనీ ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లు.
ఎన్విడియా వ్యాపార వ్యూహంలో హువాంగ్ పాత్ర ఎంతో కీలకం. ఆయన నాయకత్వంపై ఏర్పడ్డ అనిశ్చితి కంపెనీ షేర్లపై ప్రభావం చూపింది. జెన్సెన్ హువాంగ్ పై ఆరోపణలు ఇన్వెస్టర్ల ఆందోళనలను మరింత పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బోర్డు విచారణ ఫలితాలను బట్టి జెన్సెన్ హువాంగ్ సీఈఓ పదవి నుంచి తప్పుకునే పరిస్థితి రావచ్చని అంచనా వేసారు.