
దుబాయ్ వేదికగా రెండోసారి గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది టీవీ9 నెట్‌వర్క్. గతేడాది జర్మనీలో జరిగిన మొదటి సదస్సుకు కొనసాగింపుగా ఇవాళ UAE గ్లోబల్ సమ్మిట్‌ను ఆర్గనైజ్ చేస్తోంది. భారత్‌లో అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్‌గా ఉన్న టీవీ9 ఆధ్వర్యంలో జరుగుతోన్న న్యూస్9 – యూఏఈ గ్లోబల్ సమ్మిట్‌లో ఇరు దేశాల అభివృద్ధి, సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందాలు, ఇండియా-మిడిలీస్ట్-యూరప్ కారిడార్, టారిఫ్ ఛాలెంజ్‌లు, స్టార్టప్‌లు, ఏఐ, సాంస్కృతిక అనుసంధానంపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఉన్నతస్థాయి ప్యానెల్ చర్చలు జరుగుతున్నాయి.
న్యూస్9 – గ్లోబల్ సమ్మిట్ దుబాయ్ ఎడిషన్ ఈరోజు, జూన్ 19న నిర్వహించడం జరిగింది. భారత్ – యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, బాలీవుడ్ ప్రముఖులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. అనేక అంశాల్లో భారత్ – యూఏఈ భాగ్యస్వామ్యంపై టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌లో కీలక చర్చ జరుగుతోంది. ఈ సదస్సులో దుబాయ్‌లోని భారత రాయబారి సంజయ్ సుధీర్ హాజరై ఇరు దేశాల భాగస్వామ్య సంబంధాలపై ప్రసంగించారు.. యుఎఇ-భారత్ మధ్య చాలా బలమైన సంబంధం ఉందని అన్నారు. అనేక విషయాలలో కలిసి పనిచేస్తున్నామని, అనేక అవగాహన ఒప్పందాలపై సంతకం చేసామన్నారు. మన సంబంధాలు వాణిజ్యానికే పరిమితం కాదు. విద్యా రంగంలో కూడా కలిసి పనిచేస్తున్నామన్నారు.
ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్‌ను గత ఏడాది జనవరిలో ప్రారంభించామని సంజయ్ సుధీర్ తెలిపారు. బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఐఐఎం అహ్మదాబాద్ తన తొలి అంతర్జాతీయ క్యాంపస్‌ను దుబాయ్‌లో ప్రారంభిస్తోందని భారత రాయబారి తెలిపారు. దీనిపై 2025 ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి క్యాంపస్‌లో ఎంబీఏ కోర్సు అధ్యయనాలు ప్రారంభమవుతాయి. త్వరలో ఐఐఎఫ్‌టీ క్యాంపస్ దుబాయ్‌లో కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రస్తుతం ఐఐఎఫ్‌టీకి భారతదేశంలో ఢిల్లీ, కోల్‌కతాలో రెండు క్యాంపస్‌లు ఉన్నాయన ఆయన తెలిపారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత రాయబారి సంజయ్ సుధీర్ గురువారం భారతదేశం-యుఎఇ సంబంధాలను చాలా ప్రత్యేకమైనవని అభివర్ణించారు. యుఎఇని భారతదేశం అత్యంత సన్నిహిత భాగస్వామిగా భావిస్తుందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధం కాల పరీక్షకు నిలబడటమే కాకుండా లోతైన నమ్మకం, పెరుగుతున్న ప్రపంచ ప్రభావంతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా కూడా అభివృద్ధి చెందిందని అన్నారు.
ద్వైపాక్షిక సంబంధాలను ఆయన ప్రస్తావిస్తూ, 2017లో భారతదేశం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై సంతకం చేసిన మొదటి దేశం UAE అని అన్నారు. నేడు రెండు దేశాలు వ్యాపారంతో పాటు విద్యా రంగంలో కలిసి పనిచేస్తున్నాయని, ముందుకు సాగుతున్నాయని భారత రాయబారి అన్నారు.
కీలక దేశాలతో భారత్ వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా న్యూస్9 – గ్లోబల్ సమ్మిట్ సిరీస్‌ను రూపొందించింది టీవీ9 నెట్‌వర్క్. అందులో భాగంగా గతేడాది నవంబర్‌లో జర్మనీ వేదికగా మొదటి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది టీవీ9 నెట్‌వర్క్. జర్మనీ సమ్మిట్‌కు సక్సెస్‌గానే ఇప్పుడు దుబాయ్ సదస్సు నిర్వహిస్తున్నట్టు టీవీ9 నెట్‌వర్క్ ఎండీ అండ్ సీఈవో బరుణ్ దాస్ చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..