
హైదరాబాద్, మార్చి 24: 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 49 లక్షల మంది చిన్నారులు తమ ఐదో పుట్టినరోజు కూడా జరుపుకోకుండానే కన్నుమూశారని ఈ నివేదిక వెల్లడించింది. నివేదికలోని కీలక అంశాలు ఏడాదిలో 49 లక్షల మరణాలు అంటే సగటున ప్రతిరోజూ 13,300 మందికి పైగా లేదా ప్రతి నిమిషానికి 9 మంది చిన్నారులు మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మరణాలలో దాదాపు సగం మంది 23 లక్షల మంది పుట్టిన నెల రోజుల్లోనే చనిపోతున్నారు. తక్కువ బరువుతో పుట్టడం, ప్రసవ సమయంలో తలెత్తే సమస్యలు ఇందుకు ప్రధాన కారణాలు. 2000 నుంచి 2015 మధ్య చిన్నారుల మరణాల రేటును తగ్గించడంలో ప్రపంచం వేగంగా పురోగతి సాధించింది. కానీ, 2015 తర్వాత ఆ వేగం 60 శాతం మేర మందగించడం ఆందోళన కలిగిస్తోంది. న్యుమోనియా, డయేరియా, మలేరియా వంటి నివారించదగిన వ్యాధులే చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి అని WHO ఆందోళన వ్యక్తం చేస్తుంది.
నివేదికలో తొలిసారిగా తీవ్రమైన పోషకాహార లోపం గురించి ప్రస్తావించారు. కేవలం పోషకాహారం అందక 2024లో లక్ష మందికి పైగా చిన్నారులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉన్నా, భారత్ మాత్రం చిన్నారుల మరణాల రేటును తగ్గించడంలో అద్భుతమైన ప్రగతిని కనబరుస్తోంది. 1990లో ప్రతి వెయ్యి మందికి 127గా ఉన్న ఐదేళ్లలోపు మరణాల రేటు, 2024 నాటికి 26.6 కు పడిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న టీకా కార్యక్రమాలు, ఆసుపత్రి ప్రసవాలు, తల్లీబిడ్డల సంరక్షణ పథకాలు ఇందుకు ప్రధాన కారణమని నివేదిక ప్రశంసించింది.
చిన్నారుల మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పులు ఈ మరణాలను పెంచుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా ఆరోగ్య రంగానికి అందుతున్న నిధుల్లో కోత విధిస్తుండటం వల్ల 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నివారించగల కారణాల వల్ల ఒక్క బిడ్డ కూడా మరణించకూడదు అని యునిసెఫ్ డైరెక్టర్ కాథరిన్ రస్సెల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా అడుగులు వేస్తేనే చిన్నారుల ప్రాణాలను కాపాడుకోగలమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.