Israel PM India Tour: ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్(Naftali Bennett) వచ్చే నెల అంటే ఏప్రిల్ 2న తొలిసారిగా భారత్(India)లో పర్యటించనున్నారు. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకార విస్తరణపై ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)తో చర్చలు జరపనున్నారు. దౌత్య సంబంధాల స్థాపనకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ మొదటి వారంలో తాను భారత్‌లో పర్యటిస్తానని నఫ్తాలీ బెన్నెట్ తెలిపారు. అలాగే భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు అర్థవంతమైన సహకారంపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ ఏప్రిల్ 2వ తేదీన భారత్‌లో తన మొదటి అధికారిక పర్యటనను చేస్తారని ఇజ్రాయెల్ ప్రధాని మీడియా సలహాదారు తెలిపారు. గత అక్టోబరులో గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు (COP-26)లో ఇరువురు నేతల తొలి సమావేశం జరిగినట్లు ప్రకటన పేర్కొంది. భారతదేశానికి అధికారిక పర్యటన కోసం పిఎం బెన్నెట్‌ను పిఎం మోడీ ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయిల్ రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది. నూతన ఆవిష్కరణ, సాంకేతికత, భద్రత, సైబర్ వ్యవహారాలు, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడం కూడా ఈ పర్యటన లక్ష్యంగా ఉందని నఫ్తాలి వెల్లడించినట్టు ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది.
బెన్నెట్ మాట్లాడుతూ, “నా స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు భారతదేశానికి నా మొదటి అధికారిక పర్యటన చేయడానికి నేను చాలా సంతోషంగా, ఆసక్తిగా ఉన్నాను.” మన దేశాల మధ్య సంబంధాల కోసం మనం ముందుకు సాగుతూనే ఉంటాం. భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను మోదీ పునరుద్ధరించారని బెన్నెట్ చెప్పారు. భారతీయ సంస్కృతి మరియు యూదు సంస్కృతి మధ్య సంబంధం చాలా లోతైనది. అలాగే భారత్ అర్థవంతమైన సహకారంపై తనకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. భారతీయుల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, బెన్నెట్ ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 5 వరకు నాలుగు రోజుల పర్యటనలో భారతదేశాన్ని సందర్శిస్తారు. బెన్నెట్ తన పర్యటనలో తన భారతీయ కౌంటర్, సీనియర్ ప్రభుత్వ అధికారులు, స్థానిక యూదు సమాజాన్ని కూడా కలుస్తారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశం. అలాగే, ఇన్నోవేషన్, ఎకానమీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌తో సహా అనేక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరుగుతాయి.
Read Also….