
బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తేనెటీగల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇతర రకాల పరాగసంపర్క కీటకాల సంఖ్య తక్కువగా ఉంది. ముఖ్యంగా బంబుల్‌బీస్ (పెద్ద తేనెటీగలు), హోవర్‌ఫ్లైస్ వంటి కీటకాలు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పూలపై ఉన్న తేనె, పుప్పొడిని సేకరించేందుకు తేనెటీగలు వీటితో పోటీ పడుతున్నాయి. వీటిని నెట్టేయడం, ఢీకొట్టడం, వెంటాడి తరిమేయడం చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఈ పోటీలో తేనెటీగలే విజయం సాధిస్తున్నాయి.
తేనెటీగలు, ఇతర కీటకాల మధ్య పోటీ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పరిశోధకులు బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌షైర్ ప్రాంతంలో రెండేళ్లపాటు అధ్యయనం చేశారు. బ్రాంబుల్, ఐవీ మొక్కల పూల వద్దకు వచ్చే వివిధ రకాల కీటకాలను పరిశీలించారు. మొత్తం 300 పోటీ ఘటనలను నమోదు చేశారు. తేనెటీగలు, బంబుల్‌బీస్, ఒంటరిగా జీవించే తేనెటీగలు, హోవర్‌ఫ్లైస్, ఇతర పూలను సందర్శించే కీటకాల మధ్య పోటీలను విశ్లేషించారు. ఈ పోటీల్లో ఏ కీటకం ఆహారాన్ని పొందింది? ఏది వెనక్కి తగ్గింది? ఏ సందర్భాల్లో రెండూ కలిసి ఆహారాన్ని సేకరించాయి నమోదు చేశారు. దాదాపు అన్ని రకాల పోటీల్లో తేనెటీగలే ఎక్కువసార్లు విజయం సాధించాయి. అడవి పరాగసంపర్క కీటకాలు ఒకవైపు ఆహార వనరుల కోసం పోటీ పడుతూనే.. మరోవైపు తేనెటీగల ప్రత్యక్ష దాడులను ఎదుర్కొంటున్నాయని అధ్యయనానికి నాయకత్వం వహించిన విక్టోరియా బకిల్ ఆందోళన వ్యక్తం చేసారు .
సాధారణంగా తేనెటీగల దాడిని తట్టుకుని వాటికి ఎదురొడ్డి నిలిచే కీటకాలు చాలా తక్కువ. అయితే ఐవీ బీ (Ivy Bee) అనే రకం మాత్రం తేనెటీగలను తరిమేయగలిగింది. ఇవి ప్రధానంగా ఐవీ మొక్కల పూల నుంచి తేనెను సేకరిస్తాయి. అధ్యయనంలో ఇవి తేనెటీగలను నెట్టేయడం, వెంటాడి తరిమేయడం చేసినట్లు పరిశోధకులు గుర్తించారు.
బ్రిటన్‌లో తేనెటీగలను పెంచేవారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. తేనెటీగలను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ ఇళ్ల వద్ద, తోటల్లో తేనెటీగల పెట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పెంపుడు తేనెటీగల సంఖ్య పెరుగుతోంది. దీంతో అడవుల్లో సహజంగా జీవించే ఇతర పరాగసంపర్క కీటకాలకు ఆహార కొరత ఏర్పడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా వ్యాధులు కూడా ఒక కీటకం నుంచి మరో కీటకానికి వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పూలలోని తేనె త్వరగా ఆవిరైపోవడం, మొక్కలు వేడి ఒత్తిడికి గురికావడం వల్ల ఆహార వనరులు తగ్గుతాయి. దీంతో కీటకాల మధ్య పోటీ మరింత తీవ్రమవుతుంది. అదే జరిగితే తేనెటీగలు, ఇతర పరాగసంపర్క కీటకాల మధ్య ఆహారం కోసం పోటీ మరింత పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.
తేనెటీగలను పెంచడం, వాటిని సంరక్షించడం ఎంత ముఖ్యమో.. ప్రకృతిలోని ఇతర పరాగసంపర్క కీటకాల మనుగడను కాపాడటం కూడా అంతే ముఖ్యమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఒక జాతిని కాపాడే ప్రయత్నం మరో జాతి మనుగడకు ముప్పుగా మారకూడదని ఈ పరిశోధన గుర్తుచేస్తోంది.