ఫ్లోరిడా సముద్రంలో షార్క్ దాడిలో గాయపడ్డ వ్యక్తి.. అంతలో .. హీరోలా దూకి..

అమెరికాలోని ఫ్లోరిడా సముద్రంలో 40 ఏళ్ల వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నాడు. హఠాత్తుగా ఎక్కడ నుంచి వచ్చిందో కానీ 'బుల్ షార్క్' (Bull Shark) అతడిని చుట్టుముట్టింది. అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. " హెల్ప్ .. హెల్ప్..'' అంటూ అతను కేకలు వేసినా కామెడీ చేస్తున్నాడనీ ఏదో సాధారణ గాయమై ఉంటుందని బోటు కెప్టెన్ జాకబ్ జాన్సన్ తొలుత భావించి లైట్ తీసుకున్నారు.

ఫ్లోరిడా సముద్రంలో షార్క్ దాడిలో గాయపడ్డ వ్యక్తి.. అంతలో .. హీరోలా దూకి..
Man Saves Friend From Violent Shark Attack Off Florida Coast

Edited By:

Updated on: Sep 07, 2026 | 4:40 PM

కానీ, బోటు పక్కన చూసేసరికి అక్కడ నీరు ఎరుపు రంగులోకి మారడం చూసి జాకబ్ జాన్సన్ షాకయ్యారు. ఆ పక్కనే భారీ షార్క్ నీటిలో తచ్చాడుతూ కనిపించింది. మణికట్టు దగ్గర తీవ్రంగా గాయపడి, రక్తస్రావం కావడంతో నీటిలో కొట్టుమిట్టాడుతూ ఆ వ్యక్తి కనిపించాడు. తీవ్ర గాయం కారణంగా అతడు స్వయంగా బోట్ ఎక్కలేని స్థితిలో ఉన్నాడు.

తన ప్రాణాలకు ముప్పు ఉందనే విషయాన్ని కూడా లెక్కచేయకుండా కెప్టెన్ జాకబ్  జాన్సన్ వెంటనే సముద్రంలోకి దూకారు. క్షణాల వ్యవధిలో బాధితుడి దగ్గరకు చేరుకుని, అతడ్ని సురక్షితంగా చేతుల మధ్య బంధించి, షార్క్ నుంచి దూరంగా బోటు పైకి ఎక్కించారు.

బోటు పై ఉన్న మిగతా డైవర్లు వెంటనే అప్రమత్తమై అతడిని పైకి లాగారు. రక్తస్రావాన్ని అరికట్టడానికి ప్రాథమిక చికిత్స అందించారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ బృందం వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడిని ఒడ్డుకు చేర్చారు.  బాధితుడిని హెలికాప్టర్ ద్వారా తరలించి పెన్సకోలా ఆసుపత్రిలో చేర్చారు. షార్క్ దాడిలో అతని మణికట్టు ధమనికి తీవ్ర గాయమవగా, మరొక చేతి మణికట్టుకు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం అతనికి ఒక శస్త్రచికిత్స పూర్తి కావడంతో కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

ఆ రోజు ఫ్లోరిడా తీరంలో పెను విషాదం తప్పింది. బోట్ కెప్టెన్ జాకబ్ జాన్సన్ సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలతో వ్యవహరించడంతో భారీ షార్క్ కు ఆహారం కాకుండా  డైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు.   ప్రమాదం జరిగినప్పుడు, ” అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి సమయం లేదు. నేను వెంటనే నీటిలోకి దూకాను. రక్షించే ప్రయత్నం చేశాన”ని జాన్సన్ గుర్తుచేసుకున్నాడు. “మొదట చిన్న ప్రమాదమేనని భావించా.. ట్రిగ్గర్ ఫిష్ ఏమైనా కరిచిందేమోనని అతడిని ఆట పట్టిద్దామని బోట్ అంచు నుంచి కిందకు చూశా. కానీ, అతడి చుట్టూ రక్తం మడుగులా ఉండటం చూసి షాకయ్యా” అన్నారు.  ఈ ఘటనకు సంబంధించిన సాహసోపేతమైన రెస్క్యూ వీడియోలు, కథనాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. తన ప్రాణాలను పణంగా పెట్టి స్నేహితుడిని కాపాడిన బోటు కెప్టెన్ జాన్సన్ తెగువను మెచ్చుకుంటూ ‘నిజమైన హీరో’ అంటూ నెటిజన్లు ప్రశంసించారు. ‘న్యూయార్క్ పోస్ట్’ కూడా ఈ కథనాన్ని ప్రచురించింది.

 

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us