
అమెరికాలోని వాషింగ్టన్ విమానాశ్రయంలో అనుకోని ఘటన జరిగింది. వేర్వేరు విమానాలను నడుపుతూ విధి నిర్వహణలో ఉన్న ఓ తండ్రీ కూతురు… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) రేడియో ద్వారా అనుకోకుండా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా, భావోద్వేగ సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
విమానాశ్రయంలో ఒకే సమయంలో వేర్వేరు విమానాల్లో ఉన్న తండ్రీకూతుళ్లు రేడియో కమ్యూనికేషన్‌లో ఒకరి గొంతు మరొకరు గుర్తించారు. కూతురు ఎంతో ప్రేమగా “పాప్స్?” అని అనగానే, తండ్రి కూడా చిరునవ్వుతో స్పందిస్తూ మాట్లాడారు. వృత్తిరిత్యా ఇద్దరూ పైలట్లుగా రాణిస్తూ, రన్‌వే పై అనుకోకుండా ఎదురుపడి మాట్లాడుకున్న సంభాషణ వైరల్ గా మారి నెటిజన్ల మనసులను హత్తుకుంటున్నాయి.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 108 ని నడుపుతున్న తండ్రి కెప్టెన్ కెంట్ కాట్నిక్ జర్మనీ వెళ్ళడానికి రన్‌వే పై సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో కమ్యూట్ ఎయిర్ ఫ్లైట్ 4977 లో కో-పైలట్‌గా ఉన్న అతని కుమార్తె కెన్నీ కాట్నిక్ కూడా సైరాక్యూస్ వెళ్ళడానికి అదే రన్‌వే వద్దకు చేరుకుంది. ఆ సమయంలో రేడియోలో తండ్రి వాయిస్ విన్న కూతురు, సాధారణ పైలట్ సంభాషణల ప్రోటోకాల్‌ను కాసేపు పక్కన పెట్టి సరదాగా మాట్లాడటంతో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.
కూతురు (కెన్నీ): “పాప్స్? (నాన్నా?)”
తండ్రి (కెంట్) : “హలో.. (తండ్రి గంభీర స్వరంతో).. ఎక్కడున్నావ్ నువ్వు?
“కూతురు: “రన్‌వే 1R దగ్గర డిపార్చర్ కోసం వెయిట్ చేస్తున్నా. హ్యాపీ జర్నీ, బై బై.”
<ఈ సంభాషణను రేడియో ఫ్రీక్వెన్సీలో వింటున్న మరొక విమాన పైలట్ మధ్యలో స్పందిస్తూ తండ్రిని ఆటపట్టించడం మొదలుపెట్టాడు.
మరో పైలట్: “అంటే మీ అమ్మాయి కూడా పైలట్ అన్నమాట. చాలా గర్వంగా ఉంది కదూ నాన్నా?”
తండ్రి: “ఆ.. అవును..”
మరో పైలట్: “ఆమె ఇంకా మీ ఇంట్లోనే ఉంటుందా?”
తండ్రి: ” లేదు, లేదు.. కానీ ఆమె ఇప్పటికీ నా ఫ్యామిలీ సెల్‌ఫోన్ ప్లాన్ (మొబైల్ బిల్లు) లోనే ఉంది! (అంటే బిల్లు నేనే కడుతున్నా).”
మరో పైలట్: “నేను కూడా పెళ్లయ్యేంత వరకు మా అమ్మ సెల్‌ఫోన్ ప్లాన్ లోనే ఉన్నాను.”
కూతురు (కెన్నీ): (మధ్యలో అందుకుని).. “నేను ఇంకా సింగిల్‌నే (నాకు పెళ్లి కాలేదు).”
మరో పైలట్: “ఓహో.. చూశారా, అందుకే నువ్వు ఇంకా మీ నాన్న సెల్‌ఫోన్ ప్లాన్ వాడుతున్నావ్!”
వీరి సంభాషణ క్లిప్ ను యునైటెడ్ ఎయిర్ లైన్స్, డల్లెస్ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం పంచుకోవడంతో, నెటిజన్లు ఈ తండ్రీకూతుళ్ల బాండింగ్‌ను చూసి మురిసిపోతున్నారు. నిత్యం ఎంతో సీరియస్‌గా సాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంభాషణల మధ్యలో ఇలాంటి ఒక మనసులను తాకే , నవ్వులు పూయించే కుటుంబ సంభాషణ చోటుచేసుకోవడం విమానయాన రంగంలో ఒక అరుదైన ఘటనగా నిలిచింది.