
రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అనూహ్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలో యూఎస్‌లో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావడమే ధ్యేయంగా.. ఆ దేశంతో ఒక భారీ ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా డీజిల్‌పై ఆంక్షలను 2027 ఏప్రిల్ వరకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శుక్రవారం ఫోన్‌లో చర్చలు జరిపిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు.. రష్యా నుంచి భారీగా డీజిల్ సరఫరా అవతుందని.. ధరలు వేగంగా తగ్గుతాయని ట్రంప్ తెలిపారు.
మూడు లక్షల టన్నులకుపైగా డీజిల్‌ను అమెరికాకు, అంతర్జాతీయ విపణికి రష్యా తక్షణమే సరఫరా చేసేలా తమ చర్చల్లో ఒప్పందం కుదిరిందంటూ ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ పోస్టు పెట్టారు. నవంబరులో మరో 5 లక్షల టన్నుల డీజిల్‌ను.. ఆ తర్వాత వెంటనే ఇంకో 10 లక్షల టన్నులను మాస్కో సరఫరా చేస్తుందన్నారు. ఆపై ఆ దేశ డీజిల్ రిఫైనరీల పరిస్థితులను బట్టి స్వల్ప కాలంలోనే మరో 30 లక్షల టన్నుల వరకూ అందిస్తుందని తెలిపారు. హార్ముజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని.. ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనివ్వమంటూ ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టంచేశారు.
ఈ ఒప్పందం ప్రకారం రష్యా నుండి తక్కువ ధరకే శుద్ధి చేసిన డీజిల్ అమెరికాకు సరఫరా కానుంది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపులోకి వస్తాయని వైట్‌హౌస్ వర్గాలు ఆశిస్తున్నాయి.
భూరాజకీయ పరంగా ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైనప్పటికీ, అంతర్జాతీయ దౌత్య సమీకరణాల కంటే తమ దేశ ఆర్థిక ప్రయోజనాలు, ఓటర్ల సంతృప్తికే ట్రంప్ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. రష్యా నుంచి డీజిల్ సరఫరా పెరిగితే ధరలు వేగంగా తగ్గుతాయని చెప్పలేమని.. నిపుణులు చెబుతున్నారు. సరఫరా పరిమాణం, ప్రపంచవ్యాప్త డిమాండ్, రవాణా పరిస్థితులు వంటి అంశాలపై ప్రభావం ఆధారపడి ఉంటుందంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిా..