
ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వివరాలు ది ఈజిప్షియన్ జర్నల్ ఆఫ్ బ్రాంకాలజీలో ప్రచురితమైంది. 72 ఏళ్ల ఓ వ్యక్తి కొన్ని నెలలుగా కఫం దగ్గుతో బాధపడుతున్నారు. తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడంతో వైద్యులను సంప్రదిస్తున్నారు. ప్రతిసారీ యాంటీబయాటిక్స్ వాడుతున్నా సమస్య తగ్గడం లేదు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ, గతంలో క్యాన్సర్ వచ్చిన చరిత్ర లేదు. బరువు తగ్గడం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, దగ్గుతో రక్తం రావడం వంటి లక్షణాలు లేవు.
అయితే సీటీ స్కాన్‌లో కుడి ఊపిరితిత్తి కింది భాగం శ్వాసనాళంలో ఏదో అడ్డుగా ఉన్నట్లు కనిపించింది. దాని వెనుక భాగంలో వాపు కూడా గుర్తించారు. దీంతో అక్కడ కణితి ఉండొచ్చని వైద్యులు అనుమానించారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడే కార్సినాయిడ్ ట్యూమర్ అయ్యే అవకాశం ఉందని భావించారు.
వైద్యులు బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించారు. సన్నని, వంగే స్వభావం కలిగిన ప్రత్యేక పరికరాన్ని శ్వాసనాళంలోకి పంపించి లోపలి భాగాన్ని పరిశీలించారు. శ్వాసనాళాన్ని పూర్తిగా మూసేస్తూ ఎర్రటి రంగులో ఒక పెరుగుదల కనిపించింది. దానిపై రక్తనాళాలు కూడా స్పష్టంగా కనిపించాయి. దీంతో వైద్యుల అనుమానం మరింత బలపడింది.
ఆ అడ్డంకిని తొలగించేందుకు వైద్యులు ప్రత్యేక పరికరాలను ఉపయోగించారు. స్నేర్, క్రయోప్రోబ్ సాయంతో వాపుతో ఉన్న కణజాలాన్ని తొలగిస్తుండగా లోపల గట్టిగా, తెల్లగా ఉన్న మరో వస్తువు బయటపడింది. దాని ఉపరితలం చాలా నునుపుగా, గట్టిగా ఉండటంతో క్రయోప్రోబ్తో పట్టుకోవడం సాధ్యం కాలేదు. పలుమార్లు ప్రయత్నించిన తర్వాత ఫోర్సెప్స్, రిట్రీవల్ బాస్కెట్ సాయంతో దాన్ని బయటకు తీశారు. వైద్యులకు అసలు విషయం అర్థమైంది. ఇన్నాళ్లూ కణితి అని అనుమానించిన ప్రాంతంలో ఉన్నది ఒక మనిషి పంటి ముక్క! అది శ్వాసనాళంలోకి ఎలా వచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది.
పంటిని బయటకు తీసిన తర్వాత వృద్ధుడికి మూడేళ్ల క్రితం ఒకసారి స్పృహ తప్పి పడిపోయిన విషయం గుర్తొచ్చింది. ఊడిపోయిన పన్ను పొరపాటున శ్వాసనాళంలోకి వెళ్లింది. అప్పటి నుంచి అది అక్కడే ఉండిపోయి, చుట్టూ ఉన్న కణజాలంలో వాపుకు కారణమైంది. దాంతో శ్వాసనాళం మూసుకుపోవడం, పదేపదే ఇన్ఫెక్షన్లు రావడం జరిగాయి. విచిత్రమేంటంటే.. మొదట తీసిన సీటీ స్కాన్‌లోనూ ఆ పంటికి సంబంధించిన గుర్తు కనిపించింది. కానీ దాన్ని అప్పట్లో గుర్తించలేకపోయారు.
పంటిని తొలగించిన తర్వాత వృద్ధుడి ఆరోగ్యం మెరుగుపడింది. దగ్గు, ఇన్ఫెక్షన్ తగ్గాయి. శ్వాసనాళం తిరిగి తెరుచుకుంది. దగ్గు తగ్గక పోవడానికి పదే పదే ఛాతీ ఇన్ఫెక్షన్లకు కణితి కారణం కాదు మూడేళ్లుగా శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన పంటి ముక్క అని తెలిసి ఈ కేసు అరుదైందిగా జర్నల్ లో నమోదైంది.