కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!

కొలంబియాకు చెందిన ఓ 67 ఏళ్ల బామ్మ తన చుట్టుపక్కల ఇళ్లల్లో జరిగే విషయాలను ఇతరులకు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో  ఏకంగా రెండు ఇళ్లు కొనుగోలు చేసినట్లు ఆమె చెప్పడం అందరినీ షాకయ్యేలా చేస్తోంది. కాలనీలోని  కుటుంబాలలో జరిగే గొడవలు,  గడప దాటి బయటకు రాని ప్రైవేట్ విషయాలను సేకరించడంలో ఆమె దిట్ట. కంటెంట్ క్రియేటర్ లేడీ డానియెల్లా నిర్వహించిన ఇంటర్వ్యూలో మిర్యమ్ తన వింత వ్యాపారాన్ని బయటపెట్టడంతో ప్రస్తుతం ఆమె వీడియో వైరల్ అవుతోంది. 

కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
Colombian Woman Sells Neighbourhood Gossip For Cash

Updated on: Sep 07, 2026 | 5:16 PM

కొలంబియా మహిళ మిర్యమ్  తన వినూత్న ఆలోచన వెనుక కథను వివరిస్తూ.. కాలనీలోని రహస్యాలను సేకరించడంలో తనకు ఉన్న ఆసక్తిని వ్యాపారంగా మలచుకున్నాననీ, ఆ సంపాదనతోనే తాను రెండు ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రహస్యాలను సేకరించి వాటిని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి విక్రయించి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

తన ఇంటి బయటే కూర్చుని చుట్టుపక్కల జరిగే ప్రతీ విషయాన్ని ఆమె గమనిస్తుంటారట.   ఇరుగు పొరుగు వారి సంభాషణలను ఆసక్తిగా వింటాననీ తాను విన్న సమాచారాన్ని మర్చిపోకుండా ఉండేందుకు, ఇతరులతో పంచుకునే విషయాలకు ఒక ఆధారంగా ఉంటుందని ఒక నోట్‌బుక్‌లో రాసి దాచుకుంటాననీ అన్నారు.  ఇంటి గుమ్మం వద్దే నిలబడి కాలనీలో ఎక్కడ ఏం జరిగినా నోట్‌బుక్‌లో క్షణాల్లో నోట్ చేసుకుంటారట.

ఆధారాలనూ సేకరిస్తాను

తాను చెప్పే గాసిప్‌లు అబద్ధాలు కావని నిరూపించడానికి, చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఈ డైరీ రైటింగ్ తనకు ఎంతో ఉపయోగపడింని ఆమె ఇంటర్వ్యూలో తెలిపారు. “నేను మీతో ఇక్కడ మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ నా చిన్న చెవులు మాత్రం చుట్టుపక్కల ఏం జరుగుతుందో వినడానికి సిద్ధంగా ఉంటాయి” అని మిర్యమ్ అన్నారు.

ఒక్కో గాసిప్ కు ఒక్కో రేటు

గాసిప్ తీవ్రతను బట్టి ఒక్కో గాసిప్ కు ఒక్కో రేటును ఆమె ఫిక్స్ చేయడం విశేషం. సాధారణ కబుర్లకు 5,000 నుంచి 10,000 కొలంబియన్ పెసోలు వసూలు చేస్తుండగా,  ఎవరికీ తెలియని అత్యంత రహస్య సమాచారానికి భారీగా వసూలు చేస్తారట. భార్య ఊరు వెళ్లిన ప్రతిసారీ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకునే ఓ  వ్యక్తి రహస్యాన్ని తాను పసిగట్టానని, ఆ సమాచారాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు తనకు ఏకంగా 7,00,000 కొలంబియన్ పెసోలు ముట్టచెప్పాడని మిర్యమ్ అన్నారు.   సాధారణ కబుర్లకు కొద్ది మొత్తాలలో తీసుకునే ఆమె, వివాహేతర సంబంధాల వంటి రహస్యాలకు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారట.

బ్లాక్‌మెయిల్ vs వ్యాపారం

కొన్ని రహస్యాలు బయటపడితే పరువు పోతుందనే భయంతో కొందరు ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికి వెనుకాడరు. ఇంటర్వ్యూ సందర్భంగా మిర్యమ్..లేడీ డానియెల్లాకు తన ఇంటిని తిప్పి చూపించారు. తాను సేకరించిన సమాచారానికి సంబంధించిన ఫొటోలు, ఇతర ఆధారాలతో నిండిన ఒక బోర్డును ఒక గదిలో వేలాడదీసారు. వివాహేతర సంబంధాలతో సహా తాను సేకరించే ప్రతి గాసిప్ ఊహాజనితం కాదని, దానికి సంబంధించిన ఫొటోలు, ఇతర ఆధారాలను భద్రపరుస్తానని మిర్యమ్ తన బిజినెస్ సీక్రెట్ బయటపెట్టారు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పటికీ, తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో నిశితంగా గమనించే తన నైపుణ్యాన్ని వ్యాపార అవకాశంగా మలుచుకున్నట్లు తెలిపారు.

తనను ఇరుగుపొరుగు వారు “క్వీన్ ఆఫ్ గాసిప్” గా పిలుస్తారనీ. తనను చూసి కొందరు వ్యాపార శైలిని కాపీ కొట్టే ప్రయత్నం చేశారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, కాలనీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఈ రంగంలో తాను నంబర్ వన్ గా నిలుస్తున్నట్లు మిర్యమ్ అన్నారు.  పోటీదారులు పుట్టుకొస్తున్నప్పటికీ తనకున్న మార్కెట్ వేరని ఆమె చెప్పారు.  తను ఒక్క వారంలో కేవలం గాసిప్‌లు అమ్మి సంపాదించిన డబ్బులను ఆమె చూపించారు.  నోట్ల కట్టలతో నిండిపోయిన  పిగ్గీ బ్యాంక్ ను చూస్తే ఆమె  వింత వ్యాపారం ద్వారా వారానికి ఎంత ఆర్జిస్తున్నారో  అర్థమవుతుంది.

కేవలం తన ఇంటి చుట్టూ ఉన్న వీధులకే పరిమితం కాకుండా, మిర్యమ్ తన రెండో ఇంటిని వ్యాపార కేంద్రంగా మార్చారు.  ఆ ఇంట్లో స్నేహితులతో  బోర్డ్ గేమ్‌లు ఆడుతూ, ఆ సరదా సమావేశాన్ని, రహస్యాలను  ఒకరికొకరు పంచుకునే వేదిక కింద వాడుకునేట్లు ఆమె తెలిపారు. స్నేహితులతో సరదాగా గడిపే ఆటల సమయాన్ని కూడా ఆమె వ్యాపారానికి అనుకూలంగా మలుచుకుంటూ కొత్త విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తుంటారట.

ఈ వింత వ్యాపారాన్ని ఆమె కేవలం తన సొంత సంపాదన వరకే పరిమితం చేయకుండా, తన చుట్టూ ఉన్న వారికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారట. అయితే ఆ వివరాలను ఆమె పంచుకోవడానికి ఇష్టపడలేదు.  ఎవరూ ఊహించని విధంగా ఇతరుల వ్యక్తిగత విషయాలను సేకరించి వ్యాపారంగా మార్చడం ద్వారా మిర్యం పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్న విషయ తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్పానిష్‌ భాషలో ‘చిస్మోసా’ (Chismosa) అంటే గాసిప్‌లు చెప్పే మహిళ అని అర్థమట. తన చుట్టుపక్కల జరిగే విషయాలపై నిరంతరం కన్నేసి ఉంచే మిర్యమ్… తన కాలనీలో ‘ప్రొఫెషనల్ చిస్మోసా’గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us