చైనా మరో సంచలనం.. తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్‌ సేఫ్ ల్యాండింగ్!

చైనా అంతరిక్ష రంగంలో మరో విజయం సాధించింది. పునర్వినియోగ రాకెట్‌ సాంకేతికతలో భాగంగా తొలిసారి జుక్యూ-3 రాకెట్ తొలి దశను భూమిపై విజయవంతంగా తిరిగి ల్యాండ్ చేసి రికవర్ చేసింది. ల్యాండ్‌స్పేస్‌ రూపొందించిన ఈ రాకెట్ 66.1 మీటర్ల పొడవుతో ఉండగా, దాని బూస్టర్‌ను ప్రయోగ కేంద్రానికి సుమారు 390 కిలోమీటర్ల దూరంలోని గాన్సు ప్రావిన్స్‌లో సురక్షితంగా దింపారు. ఈ విజయంతో రాకెట్‌ను తిరిగి ఉపయోగించి అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది.

చైనా మరో సంచలనం.. తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్‌ సేఫ్ ల్యాండింగ్!
Representative Image

Updated on: Aug 19, 2026 | 1:17 PM

అంతరిక్ష రంగంలో చైనా మరో కీలక ముందడుగు వేసింది. పునర్వినియోగ రాకెట్ సాంకేతికతలో భాగంగా తొలిసారి ఒక రాకెట్‌ బూస్టర్‌ను భూమిపై విజయవంతంగా తిరిగి ల్యాండ్ చేసి రికవర్ చేసింది. చైనాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ల్యాండ్‌స్పేస్‌ అభివృద్ధి చేసిన జుక్యూ-3 (Zhuque-3) రాకెట్ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటికే రాకెట్‌ బూస్టర్ తొలి దశను సముద్రంలో రికవర్ చేసే సాంకేతికతను చైనా పరీక్షించింది. అయితే తాజాగా జుక్యూ-3 రాకెట్ ప్రయోగం ద్వారా తొలిసారి భూమిపై కూడా ల్యాండింగ్ సాధించింది. ఈ విజయంతో పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో చైనా మరో కీలక ముందడుగు వేసినట్లయ్యింది. జుక్యూ-3 రాకెట్‌ను చైనాలోని వాయువ్య ప్రాంతంలోని డోంగ్‌ఫెంగ్ కమర్షియల్ స్పేస్ ఇన్నోవేషన్ పైలట్ జోన్ నుంచి ప్రయోగించారు. ప్రయోగం అనంతరం రాకెట్‌ తొలి దశను నిర్దేశిత ల్యాండింగ్ ప్రాంతంలో విజయవంతంగా దింపారు. ఈసారి రాకెట్‌లో ప్రత్యేకంగా అమర్చిన విస్తరించగల ల్యాండింగ్ కాళ్లను ఉపయోగించారు.

చైనా జూలైలోనే రాకెట్‌ రికవరీలో ఓ కీలక విజయాన్ని సాధించింది. జూలై 10న లాంగ్ మార్చ్-10బీ రాకెట్‌ తొలి దశను సముద్రంలో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌పై విజయవంతంగా రికవర్ చేసింది. ఆ సమయంలో నెట్-క్యాప్చర్ సిస్టమ్ ద్వారా రాకెట్‌ను పట్టుకున్నారు. అయితే తాజాగా ల్యాండ్‌స్పేస్‌ సాధించిన విజయం భిన్నంగా ఉంది. జుక్యూ-3 తొలి దశను సముద్రంలో కాకుండా భూమిపైకి తిరిగి తీసుకొచ్చి ల్యాండింగ్ చేశారు. దీంతో చైనా పునర్వినియోగ రాకెట్ సాంకేతికతలో మరింత క్లిష్టమైన దశను అధిగమించింది. ఈ బూస్టర్‌ను భవిష్యత్తులో పలుమార్లు తిరిగి ఉపయోగించేలా రూపొందిస్తున్నారు. ల్యాండ్‌స్పేస్ లక్ష్యం ఒకే బూస్టర్‌ను 20 ప్రయోగాల వరకు ఉపయోగించడం. రికవర్ చేసిన బూస్టర్‌ను భవిష్యత్తులో మళ్లీ ప్రయోగించేందుకు సిద్ధం చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో, ఎక్కువ సంఖ్యలో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది.

రాకెట్ బూస్టర్‌ భూమిపై సేఫ్ ల్యాండ్

స్పేస్‌ Xకు చైనా పోటీ?

రాకెట్‌ తొలి దశను తిరిగి తీసుకొచ్చి మళ్లీ ఉపయోగించడం వల్ల ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ముందంజలో ఉన్నాయి. స్పేస్‌ఎక్స్ 2015 నుంచే ఆర్బిటల్ క్లాస్ బూస్టర్లను తిరిగి ల్యాండ్ చేసి పునర్వినియోగం చేస్తోంది. చైనా తాజా విజయం ఆ దేశ వాణిజ్య అంతరిక్ష రంగానికి కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం, తరచుగా ప్రయోగాలు నిర్వహించడం వంటి లక్ష్యాలకు పునర్వినియోగ రాకెట్ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది.

ఆసియాలో పెరుగుతున్న రాకెట్ పోటీ

పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీ విషయంలో చైనా మాత్రమే కాకుండా జపాన్ కూడా ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. జూలైలో జపాన్ ఒక ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్‌ను పరీక్షించి విజయవంతంగా ల్యాండ్ చేసింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించడంతో పాటు ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో పోటీపడేందుకు ఆసియా దేశాలు ఈ సాంకేతికతపై దృష్టి పెడుతున్నాయి. సముద్రంలో రాకెట్‌ తొలి దశను రికవర్ చేసిన కొద్ది వారాలకే చైనా భూమిపై కూడా బూస్టర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేయడం పునర్వినియోగ అంతరిక్ష సాంకేతికతలో కీలక పరిణామంగా మారింది. భవిష్యత్తులో రికవర్ చేసిన బూస్టర్లను మళ్లీ ప్రయోగాల్లో ఉపయోగించగలిగితే చైనా వాణిజ్య అంతరిక్ష రంగంలో మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us