COVID Variant: ఓర్నాయనో.. మరో కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా లక్షణాలు ఎలా ఉంటాయంటే..

కరోనా మళ్లీ కొత్త రూపాన్ని సంతరించుకుంది. సికాడా అనే వేరియంట్‌ అమెరికా, దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో విస్తరిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పెరగడం గానీ, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావడం గానీ జరుగుతున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. ఇంకా సాధారణ జలుబు, జ్వరం లాగే వచ్చి తగ్గుతుంది.

COVID Variant: ఓర్నాయనో.. మరో కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Coronavirus

Updated on: Mar 27, 2026 | 9:01 PM

కరోనా వైరస్ మళ్లీ రూపాన్ని మార్చుకుంది. BA.3.2 అనే కొత్త సబ్-వేరియంట్ వెలుగులోకి వచ్చింది. సికాడా అని ఈ వేరియంట్‌కు పేరు పెట్టారు. అమెరికా, దక్షిణాఫ్రికా, యూరప్ లాంటి దేశాల్లో ఈ సికాడా వైరస్ విస్తరిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమయ్యింది. సికాడా వేరియంట్ పాత ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదే. కాకపోతే సుమారు 70కి పైగా మార్పులు జరిగి కొత్త వేరియంట్‌ విస్తరిస్తోంది. ఇంత భారీ స్థాయిలో వైరస్ రూపం మార్చుకోవడం వల్ల వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ బయటపడటంతో దీనికి ‘సికాడా’ అని పేరు పెట్టారు.

ప్రస్తుతానికి దీని లక్షణాలు పాత ఒమిక్రాన్ వేరియంట్ లాగే ఉన్నాయి. ఎక్కువగా టీకా వేయించుకున్న వారిలో తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి, విపరీతమైన అలసట, నీరసం, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తేలికగా జ్వరం ఇవి తక్కువగానే కనిపిస్తున్నాయి. చాల అరుదుగా వాసన ఇంకా రుచి కోల్పోవడం లేదా రాత్రిపూట చెమటలు పట్టడం కనిపిస్తుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ వైరస్ పాత వేరియంట్ల కంటే కొంచెం వేగంగా వ్యాపించవచ్చు.

సికాడా లక్షణాలు ఎలా ఉంటాయంటే..

గతంలో కరోనా వచ్చిన వారికి లేదా టీకా తీసుకున్న వారికి ఉండే రోగనిరోధక శక్తిని కొంతవరకు తగ్గించవచ్చు. ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పెరగడం గానీ, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావడం గానీ జరుగుతున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. ఇంకా సాధారణ జలుబు, జ్వరం లాగే వచ్చి తగ్గుతుంది. కొత్త వేరియంట్ వచ్చింది అనగానే భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉంటే చాలు.. బూస్టర్ డోస్ తీసుకోని వారు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల తీవ్రమైన అనారోగ్యం కలగకుండా రక్షణ ఇస్తుంది.

జాగ్రత్తలు తప్పనిసరి..

అయితే.. జనాలు ఎక్కువగా ఉన్న చోట మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి పద్ధతులను పాటిస్తే మంచిది. జ్వరం, దగ్గు తగ్గకపోతే వెంటనే డాక్టరును సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, రూపం మార్చుకుంటూనే ఉంటుందని ‘సికాడా’ వేరియంట్ గుర్తు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి దీనివల్ల ప్రపంచానికి వచ్చే ముప్పేమీ లేదని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us