వేడిగాలులకు యూరప్‌లో 16 వేల మంది మృతి

16,000 killed in Europe due to Extreme Heatwave In a week: ఫ్రాన్స్‌, బెల్జియం, జర్మనీలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌ దాటడంతో వారం రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య 16 వేలకు పెరిగింది. కారణం అక్కడి ప్రజలకు తీవ్ర వేడి వాతావరణం అలవాటు లేకపోవడమే.

వేడిగాలులకు యూరప్‌లో 16 వేల మంది మృతి
Heat Wave Deaths Europe

Updated on: Aug 16, 2026 | 12:05 PM

యూరప్‌ను వారం రోజుల పాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసిన తీవ్ర వేడిగాలులు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. సాధారణంగా నమోదయ్యే మరణాలతో పోలిస్తే ఒక్క వారం సమయంలో దాదాపు 16,000 మంది మృతి చెందినట్లు యూరోపియన్ మోర్టాలిటీ మానిటరింగ్ నెట్‌వర్క్ వెల్లడించింది. రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో వృద్ధులు, అప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎండ వేడికి ప్రాణాలు కోల్పోయారు.

ఫ్రాన్స్‌, బెల్జియం, జర్మనీలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. దాంతో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇందుకు కారణం అక్కడి ప్రజలకు తీవ్ర వేడి వాతావరణం అలవాటు లేకపోవడమే. అంతేకాకుండా, ఆ దేశాల్లో ఎయిర్ కండీషనర్ల వినియోగం తక్కువగా ఉండటం కూడా సమస్యను తీవ్రతరం చేసింది. ప్రస్తుతం ఇది అక్కడ రాజకీయ చర్చకు కూడా దారి తీసింది. యూరప్‌లో హీట్‌వేవ్‌లు అరుదుగా సంభవిస్తాయి. గతంలోనూ హీట్‌వేవ్‌ భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. 2003లో యూరప్‌ను తాకిన హీట్‌వేవ్‌లో పది వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2022 జూలై లోనూ 16,000 మందికి పైగా మరణించారు. ఆ సమయంలో స్పెయిన్‌లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. .

తాజాగా జూన్‌లో నమోదైన ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే ఇది కేవలం ఆరంభమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో భవిష్యత్తులో యూరప్ మరింత తీవ్ర వేడి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న వరుస హీట్‌వేవ్‌లు భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యం, నగరాల మౌలిక వసతులు, జీవన విధానాలపై ఎంతటి ప్రభావం చూపనున్నాయో చెప్పడానికి ఇవి ముందస్తు హెచ్చరికలుగా నిలుస్తున్నాయి. ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావంపై డేంజర్‌ బెల్స్ మోగిస్తున్నాయి. కేవలం కొన్ని రోజుల హీట్‌వేవ్‌ ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టానికి కారణమవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

యూరప్‌కు మరో ముప్పు!

యూరప్‌ను వరుసగా వేధిస్తున్న మండుటెండలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా నదుల్లో నీటిమట్టాలు రికార్డు స్థాయికి పడిపోయాయి, చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో అడవుల్లో మంటలు చెలరేగాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి హీట్‌వేవ్ ముప్పు యూరప్‌ను వణికిస్తోంది. ఈ వారం బ్రిటన్, ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాలకు ఇప్పటికే హీట్‌వేవ్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

బ్రిటన్‌లో ఐదవ హీట్‌వేవ్!

బ్రిటన్‌లో ఈ వేసవిలో ఐదో హీట్‌వేవ్ విరుచుకుపడబోతోందని అక్కడి మెట్‌ కార్యాలయం హెచ్చరించింది. ఫ్రాన్స్‌లోని ఆగ్నేయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరగొచ్చని జాతీయ వాతావరణ సంస్థ మెటియో-ఫ్రాన్స్ హెచ్చరించింది. ఈ వేడి క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.

భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రం?

వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భవిష్యత్తులో యూరప్ మరింత వేడెక్కే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.వరుస హీట్‌వేవ్‌లు, అడవుల్లో మంటలు, నీటి కొరత, పెరుగుతున్న మరణాలు.. ఇవన్నీ యూరప్‌లో మారుతున్న వాతావరణ పరిస్థితులకు తీవ్రమైన సంకేతాలుగా మారుతున్నాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us