అదే జరిగితే.. అమెరికా కొంప మునిగినట్లే
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం బూమరాంగ్ కాబోతుందా? ఇప్పటికే ఫెడరల్ కోర్టులో మొట్టికాయలు తిన్న ట్రంప్ సర్కారుకు.. అక్కడి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగలనుందా? తాము విధించిన అడ్డగోలు టారిఫ్‌లను కోర్టు కొట్టేస్తుందని ట్రంప్ టీమ్ భయపడుతుందా? అంటే అవునంటున్నారు అమెరికా ఆర్థిక నిపుణులు.
సుప్రీంకోర్టులో ట్రంప్ సర్కారుకు ప్రతికూల తీర్పు వస్తే.. ట్రంప్ అదనంగా వసూలు చేసిన 159 బిలియన్ డాలర్ల సుంకాలను ఆయా దేశాలకు వెంటనే తిరిగి చెల్లించాల్సి రావచ్చని.. అదే పరిస్థితి తలెత్తితే అమెరికా ఖజానా అడుగంటిపోవటం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు ఊడి, మధ్య తరగతి దివాలా తీస్తుందని, దీనివల్ల అమెరికా ఆర్థికంగా దివాలా తీస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక.. అమెరికాలోకి వచ్చే విదేశీ సరుకులపై ఎడాపెడా దిగుమతి పన్నులు పెంచేశాడు. అయితే దీనిపై ఇప్పటికే ట్రంప్‌కు, అమెరికా ఫెడరల్ కోర్టు అక్షింతలు వేసింది. ఈ అదనపు సుంకాలు చట్ట విరుద్దమంటూ అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కుదరదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. అయితే, ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్ నెల మధ్యవరకు కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో, ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. అయితే.. అక్కడ కూడా ఇదే తీర్పు వస్తే.. అమెరికా ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పన్ను పంతం…చివరకు అమెరికా అంతానికి, అగ్రరాజ్య పతనానికి దారి తీస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
