మాటలకందని మహా విషాదం.. ఒకే కుటుంబంలో 3 తరాలను తుడిచేసిన ప్రమాదం

Updated on: Nov 19, 2025 | 12:17 PM

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌లోని విద్యానగర్ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. మక్కా యాత్రకు వెళ్లిన నసీరుద్దీన్ కుటుంబంలోని మూడు తరాలకు చెందిన 18 మంది సభ్యులు విషాదకరంగా మృతి చెందారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో సజీవదహనమయ్యారు. ఈ తీరని విషాదంతో బంధుమిత్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.

సౌదీ బస్సు ప్రమాదం హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నసీరుద్దీన్‌ కుటుంబం ఆనవాళ్లను శాశ్వతంగా చెరిపేసింది. వారి బంధుమిత్రుల కుటుంబాలను తీరని శోకంలో ముంచేసింది. మహా సునామీ పోటెత్తి తీర ప్రాంతాన్నంతా తుడిచిపెట్టేసినట్టు.. ఈ బస్సు ప్రమాద ఘటన.. వారి కుటుంబాన్ని దాదాపు కూకటివేళ్లతో పెకిలించేసింది. సౌదీ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని మూడు తరాల వారంతా మృతిచెందిన తీరు.. బంధుమిత్రుల గుండెలను పిండేస్తోంది. ఎనిమిది మంది పెద్దలు, పది మంది పిల్లలు మొత్తంగా 18మంది సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందారు. తన కుటుంబసభ్యులందరినీ తోడ్కొని మక్కా యాత్ర చేసిరావాలని ఇంటిపెద్ద అయిన నసీరుద్దీన్‌ చిరకాల స్వప్నం. ఇందుకు ఆయన చాన్నాళ్లుగా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 9న మక్కా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో.. ఇంట్లో తమతో బాటే ఉండే.. వృద్ధురాలైన తల్లిని తన సోదరి ఇంట్లో నసీరుద్దీన్ వదిలిపెట్టారు. అనంతరం ఈనెల 9న నసీరుద్దీన్, భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కోడళ్లు, ముగ్గురు వివాహమైన కుమార్తెలు.. 10మంది మనుమలు, మనుమరాళ్లతో మక్కా బయలుదేరారు. మక్కా నుంచి మదీనా వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి నవంబరు23న తిరిగి వచ్చేలా యాత్రను ప్లాన్ చేసుకున్నారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనటంతో.. వీరి కుటుంబం అంతా సజీవ దహనమై పోయింది. ఒకే క్షణంలో నసీరుద్దీన్‌ కుటుంబంలోని మూడు తరాలవారు మృతి చెందటంతో వారి బంధువులు తీవ్రంగా విలపిస్త్నున్నారు. అయితే, ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉన్న నసీరుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ ఒక్కడే ఆ ఇంటిలో బతికాడు. సంఘటన గురించి తెలుసుకుని ఆయన కన్నీరు మున్నీరుగా విలపించాడు. మరోవైపు, నసీరుద్దీన్ తో బాటు అతని ముగ్గురు వివాహమైన కూతుళ్లు, వారి పిల్లలు కూడా మృతి చెందటతో వారి ముగ్గురు అల్లుళ్లూ ఒంటరివారిగా మిగిలిపోయారు. ఇక.. ఈ ప్రమాదం సంగతి తెలిసి.. కూతురు ఇంట్లో ఉన్న నసీరుద్దీన్ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కొడుకు, కోడలు నుంచి మునిమనవల వరకు అందరూ ఒకేసారి కన్నుమూయటంతో ఆమెను ఓదార్చటం ఎవరి వల్లా కాలేదు. నసీరుద్దీన్ తమతో ఎంతో బాగా ఉండేవారని మక్కా వెళ్లి వస్తానన్న కుటుంబసభ్యులు ఇలా అకాల మరణం చెందడం తమను ఎంతో కలిచి వేస్తోందని వారు బాధపడుతున్నారు. సౌదీ అరేబియాలో మదీనా నుంచి మక్కా వెళుతున్న సమయంలో బస్సుప్రమాదం జరిగి 45 మంది మృతిచెందారు. వారిలో 18 మంది నసిరుద్దీన్ కుటుంబ సభ్యులున్నారు. బాధిత కుటుంబ సభ్యులను సౌదీ తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AP నడిబొడ్డున మావోయిస్టులు.. పోలీసుల వ్యూహానికి చిక్కారు

ముంచుకొస్తున్న అల్పపీడనంతో ఏపీకి వాన గండం.. తెలంగాణలో చలి పంజా

దిగివస్తున్న బంగారం,వెండి ధరలు… తులం ఎంతంటే ??

తనిఖీల్లో భాగంగా కారును చెక్‌ చేసిన పోలీసులు.. డిక్కీ ఓపెన్‌ చేయగానే

Whatsapp Call: కొంపముంచిన వాట్సాప్‌ కాల్‌.. ఏం జరిగిందంటే ??