రక్త సముద్రంగా మారిన ఫారో తీరం.. 700 తిమింగలాలు, డాల్ఫిన్‌ల వధ!
ఉత్తర అట్లాంటిక్‌లోని ఫారో ఐలాండ్స్‌లో సంప్రదాయ ‘గ్రిందాడ్రాప్’ వేట సందర్భంగా 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్‌లు హతమయ్యాయి. వైరల్ వీడియోల్లో సముద్రం రక్తంతో ఎర్రగా మారిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీశాయి. జంతు హక్కుల సంస్థలు ఈ వేటను క్రూరమైనదిగా ఖండిస్తుండగా, స్థానికులు మాత్రం ఇది తమ శతాబ్దాల నాటి సంస్కృతిలో భాగమని సమర్థిస్తున్నారు.
ఉత్తర అట్లాంటిక్ లోని ‘ఫారో ఐలాండ్స్’లో అతి క్రూరంగా, రక్తపాతంతో సంప్రదాయ వేట సాగింది. వెయ్యేళ్ల వైకింగ్ కాలం నాటి పురాతన సంప్రదాయం ‘గ్రిందాడ్రాప్’ పేరిట 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్‌లను స్థానికులు వేటాడి చంపేశారు. సముద్రపు నీరంతా రక్తంగా మారిన వీడియో వైరల్ కావడంతో అంతర్జాతీయంగా జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ సంస్థ ‘సీ షెపర్డ్’ ప్రకారం.. సముద్రంలో గుంపులుగా ప్రయాణించే తిమింగలాలను, డాల్ఫిన్‌లను స్థానికులు వందలాది మోటార్ బోట్లు, జెట్ స్కీల సాయంతో చుట్టుముట్టారు. వాటిని బలవంతంగా తీరం వైపు నెట్టుకొచ్చారు. తీరానికి రాగానే వేచి ఉన్న వందలాది మంది పురుషులు, యువకులు వాటిపై బల్లేలు, ఈటెలు, కత్తులతో దాడి చేశారు. వాటి వెన్నెముకను తెంచేలా మెడ భాగంలో దారుణంగా నరికారు. శ్వాస రంధ్రాల గుండా రక్తం చిమ్మి, సముద్రపు అలలన్నీ ఎరుపు రంగులోకి మారిపోయాయి. చనిపోయిన జీవులను క్రేన్ల సాయంతో తీరానికి చేర్చి, మాంసం కోసం ముక్కలుగా నరికారు. ఫారో ఐలాండ్స్‌లో ఈ రకమైన సామూహిక వేట శతాబ్దాలుగా సాగుతోంది. దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటి వైకింగ్ సంస్కృతిలో భాగమైన ఈ ‘గ్రిందాడ్రాప్’ వేటను స్థానికులు ఓ పండుగలా భావిస్తారు. ఈ ద్వీపాల్లో వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల పూర్వ కాలంలో తిమింగలాల మాంసం, కొవ్వు పైనే వీరు ఆధారపడేవారు. అయితే నేడు ఆహార కొరత లేకపోయినప్పటికీ, కేవలం సంప్రదాయం పేరిట, వినోదం కోసం ఈ రకమైన హింసను కొనసాగిస్తున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సామూహిక వధను పర్యావరణ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. డాల్ఫిన్లు, తిమింగలాలను ఇలా వినోదం కోసం చంపడం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నాయి. అయితే, ఫారో ఐలాండ్స్ ప్రభుత్వం, స్థానికులు మాత్రం ఈ వేటను సమర్థిస్తున్నారు. ఇది తమ సంస్కృతిలో భాగమని, చట్టబద్ధంగానే ఈ వేట సాగుతుందని వారు వాదిస్తున్నారు. ఈ వేట వాణిజ్యపరమైంది కాదని, చంపిన తిమింగలాల మాంసాన్ని విక్రయించకుండా ద్వీపంలోని ప్రజలందరికీ ఉచితంగా పంచుతామని చెప్తున్నారు. పైలట్ తిమింగలాల సంఖ్య అంతరించిపోయే ప్రమాదంలో లేదని కూడా ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, ఆధునిక సమాజంలో ఇటువంటి రక్తాన్ని చిందించే క్రూర ఆచారాలను పాటించరాదని అంతర్జాతీయ వేదికలపై డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి చుక్క దొరక్క ఎడారిలో 49 మంది మృతి
అండమాన్‌లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు
Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!
బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!
