ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!

Updated on: Jun 10, 2026 | 12:19 PM

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకోవడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని ఇరుదేశాల నేతలతో మాట్లాడిన తర్వాత దాడులు తాత్కాలికంగా నిలిచాయి. అయితే లెబనాన్, హెజ్‌బొల్లా, హూతీల అంశాలతో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

పశ్చిమాసియాలో మళ్లీ వాతావరణం వేడెక్కింది. ఇరాన్, ఇజ్రాయెల్‌ ఒకదానిపై మరొకటి సోమవారం తీవ్రంగా దాడులు చేసుకున్నాయి. డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడింది. అటు ఇరాన్‌లోని పలు నగరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విధ్వంసం సృష్టించింది. తాత్కాలిక కాల్పుల విరమణ మొదలైన రెండు నెలల తర్వాత తొలిసారి ఇంత భారీ స్థాయిలో రెండు దేశాలు దాడులు చేసుకున్నాయి. శాంతి చర్చల్లో పురోగతి కనిపించకపోవడం, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆగకపోవడం, యుద్ధంలోకి హూతీలు దిగడంతో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం దిశగా పరిస్థితులు మారుతున్నాయి. దాడుల సమాచారం తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. రెండు దేశాలు దాడులను ఆపాలని గట్టిగా హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు ఫోన్‌ చేశారు. దాడులు ఆపాలంటూ నెతన్యాహుకు ట్రంప్‌ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. ట్రంప్‌ స్వయంగా ఆ విషయాన్ని మీడియాతో చెప్పారు. దాంతో రెండు దేశాలు దాడులను ఆపేశాయి. అయితే కవ్వింపులకు దిగితే ఈసారి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని ఇరాన్, ఇజ్రాయెల్‌ పరస్పరం హెచ్చరించుకున్నాయి. దీంతో ఇరాన్‌ విషయంలో ట్రంప్‌, నెతన్యాహు మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నట్లుగా ఉంది. బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడి చేసింది. దాడులపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. టెల్‌అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇరుదేశాల మధ్య భీకర పోరు కొనసాగింది. దాడులు జరిగిన వెంటనే ట్రంప్‌ స్పందించారు. ఇరాన్‌ దాడులకు ప్రతిస్పందించవద్దని నెతన్యాహుకు సూచించారు. ‘‘శాంతి ఒప్పందానికి మరింత చేరువయ్యామనీ సోమ, మంగళ, బుధవారాల్లో ఏ క్షణమైనా ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముందనీ ట్రంప్‌ అన్నారు. దాడులను ఆపి చర్చల టేబుల్‌ వద్దకు రండి అని ఇరాన్‌కు ట్రంప్‌ సూచించారు. ఇజ్రాయెల్‌ ప్రతీకార చర్యలకు దిగొద్దనీ ఒకవేళ అలా చేస్తే గత 47 ఏళ్లుగా జరుగుతుందే కొనసాగుతుందనీ గత 3,000 ఏళ్లుగా ఈ ఘర్షణ కొనసాగుతోందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘బీబీ.. మీరు జాగ్రత్తగా ఉండండి’ అని నెతన్యాహుతో ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌పై సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తే.. ఇజ్రాయెల్‌ ఏకాకిగా మిగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఘర్షణలు తిరిగి మొదలైతే.. ఇరాన్‌తో దౌత్య ఒప్పందం కుదుర్చుకోవాలనే తన ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తాయని ట్రంప్‌ ఆందోళన వ్యక్తంచేశారు. నెతన్యాహుపై ఒత్తిడి తేవాలని పలు దేశాలు ట్రంప్‌ ను కోరాయి. దీంతో ఇజ్రాయెల్‌ ప్రతిదాడులను పరిమితం చేసేందుకు ట్రంప్‌ ప్రయత్నించినట్లు తెలిసింది. ట్రంప్‌తో ఫోన్‌ కాల్‌ మాట్లాడిన నెతన్యాహు, ఇరాన్‌ నుంచి మరిన్ని దాడులు జరగవని హామీ ఇవ్వాలనీ లేదంటే తాము వెనక్కి తగ్గమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే.. తాము ఘర్షణకు దిగమని ఇరాన్‌ అధికారులు మధ్యవర్తుల ద్వారా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇరుదేశాల మధ్య పోరుకు బ్రేక్‌ పడింది. ఇక, సోమవారం జరిగిన పోరులో అమెరికా సైన్యం పాల్గొనలేదు. అయినప్పటికీ.. ఇరాన్‌ నుంచి వస్తున్న క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌ బలగాలకు సాయం అందించినట్లు యూఎస్ రక్షణ అధికారులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై అమెరికాలోని ఇజ్రాయెల్‌ రాయబారి యెచియెల్‌ లీటర్‌ స్పందించారు. ఇరువురి నేతల మధ్య సంభాషణలు బాగా జరిగాయని.. కొన్ని పత్రికలు దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ‘వారి మధ్య దాదాపు 40 ఏళ్ల నాటి స్నేహం ఉంది. కొన్నిసార్లు ప్రేమికుల మధ్య చిన్ని చిన్న గొడవలు జరుగుతాయి. అప్పుడప్పుడు సంభాషణలు ఉద్రిక్తతలుగా మారొచ్చు’ అని మీడియాతో అన్నారు. ట్రంప్‌ అభ్యర్థన మేరకు సైనిక చర్య విషయంలో నెతన్యాహు తగ్గారన్నారు. అయితే దాడులకు ప్రతిస్పందన కచ్చితంగా ఉంటుందని అన్నారు. ఆ విషయం ట్రంప్‌కు కూడా తెలుసన్నారు. మరో వైపు రెండు దేశాల్లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ జారీ చేసింది. అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఇరాన్‌లోని భారతీయులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వదేశానికి రావాలని కోరింది. చర్చలను త్వరగా పూర్తి చేసి ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పాలని భారత విదేశాంగ శాఖ కోరింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులను ఆపకపోవడం ఇరాన్‌కు ఆగ్రహం తెప్పించింది. హెజ్‌బొల్లాకు మద్దతుగా సోమవారం ఇజ్రాయెల్‌పై వరుస డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. రెండు సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్‌పై సోమవారం తామూ దాడులు చేశామని యెమెన్‌ కేంద్రంగా ఉన్న హూతీ రెబల్స్‌ తెలిపారు. ఇజ్రాయెల్, దాని మద్దతుదారులు ఎటువంటి దాడులకు దిగినా, లెబనాన్‌ దక్షిణ ప్రాంతంపై దాడులు చేసినా మరింత తీవ్రంగా విరుచుకుపడతామని ఇరాన్‌ హెచ్చరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ప్రకృతి సృష్టించిన ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. ఇంకా మిస్టరీగానే మిస్సింగ్‌ కేసు..

Katrina Kaif: కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.

జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో

సంపదలో అంబానీనే దాటేసిన టిక్‌టాక్‌ ఫౌండర్‌

Follow Us