AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే

జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్‌లోనే

Phani CH
|

Updated on: Jul 05, 2026 | 8:03 PM

Share

జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా జరిగే మహాస్నానం అనంతరం పూరీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ‘అనసర’ కాలంలో జ్వరం వచ్చినట్లుగా భావించి 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయంలో దర్శనాలు నిలిపివేసి, ఆయుర్వేద చికిత్స, ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు. అనంతరం నేత్రోత్సవంతో భక్తులకు దర్శనమిచ్చి, ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో పాల్గొంటారు.

సమస్త కోటి బ్రహ్మాండాలను శాసించే ఆ దేవదేవుడికే జ్వరం వచ్చింది! ముక్కోటి లోకాలను కాపాడే జగన్నాథుడు రెండు రోజులుగా తీవ్రమైన జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రా దేవి ప్రస్తుతం అనారోగ్యంతో మంచాన పడ్డారు. దర్శనాలు బంద్ అయ్యాయి. నైవేద్యాలు నిలిచిపోయాయి. గర్భగుడి తలుపులకు తాళాలు పడ్డాయి. ఒక చీకటి గదిలో.. ఆయుర్వేద వైద్యం జరుగుతోంది. అసలు దేవుడికి జ్వరం ఏంటి? పూరీ నుంచి ఉత్తరాంధ్ర పాలకొండ వరకు ఏటా రిపీట్ అయ్యే ఆ ‘మిస్టరీ’ వెనుక ఉన్న రహస్యం ఏంటి? సృష్టిని శాసించే భగవంతుడికి అనారోగ్యం రావడం ఏంటి? మనుషుల లాగే దేవుడు కూడా ‘సిక్ లీవ్’ తీసుకుని చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం ఏంటి? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. ముక్కోటి దేవతలకు ఆరాధ్యుడైన పూరీ జగన్నాథుడు.. ప్రస్తుతం తీవ్రమైన జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. జగన్నాథుడితోపాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రా దేవికీ జ్వరం వచ్చింది. ప్రతీ ఏటా పూరీలో దేవుడికి జ్వరం వస్తే నయం అయ్యే వరకూ దర్శనాలుండవు. పూజలుండవు. జ్వరం తగ్గాకే అన్నీ.! ఒక్క పూరీలోనే కాదు దేశంలో జగన్నాథుడి టెంప్పుల్‌ ఎక్కడున్నా ఈ 15 రోజులు దేవుడు ఐసోలేషన్‌లో ఉంటాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని 1650 నాటి పురాతన జగన్నాథ ఆలయంలోనూ ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. అసలు స్వామివారికి జ్వరం ఎందుకు వస్తుందంటే.. దానికో ఆధ్యాత్మిక కారణం ఉంది. ఎక్కడైనా దేవతామూర్తుల విగ్రహాలు రాతితోనో, పంచలోహాలతోనో ఉంటాయి. కానీ, జగన్నాథుడి విగ్రహాలు ప్రత్యేకమైన చెక్కతో తయారవుతాయి. ఏడాది పొడవునా ఈ విగ్రహాలకు నీటితో ఎలాంటి అభిషేకాలు జరగవు. కానీ, జ్యేష్ట పౌర్ణమి నాడు మాత్రం విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు తెచ్చి.. 108 కుండల పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మహదాభిషేకం చేస్తారు. దీనినే ‘జ్యేష్టాభిషేకం’ లేదా ‘స్నాన పౌర్ణమి’ అంటారు. అన్ని నీళ్లలో తడిస్తే మనకు కూడా జలుబు చేస్తుంది కదా.. ఆ దేవతా మూర్తులకు కూడా జలుబు, జ్వరం వస్తాయని భక్తుల విశ్వాసం. జ్వరం వస్తే మనం ఎలాగైతే ఆహారం తగ్గించి, మందులు వేసుకుని రెస్ట్ తీసుకుంటామో.. సాక్షాత్తు ఆ పరమాత్మ కూడా అదే చేస్తాడు. స్నాన పౌర్ణమి నాటి రాత్రి నుంచే స్వామివార్లను గర్భగుడి పక్కనే ఉండే ఒక చీకటి గదిలోకి మారుస్తారు. దీనినే ‘అనసర గృహం’ అంటారు. పూరీలో నిత్యం 60 పుట్ల అన్నం, పప్పు, 56 రకాల నైవేద్యాలు ఆరగిస్తాడు జగన్నాథుడు. కానీ, ఈ 15 రోజులు ఆ మహా నైవేద్యాన్ని పూర్తిగా నిలిపేస్తారు. అన్నానికి బదులుగా కేవలం పండ్ల రసాలు, ఆయుర్వేద కషాయాలు, ఔషధ మూలికలు మాత్రమే ఆహారంగా ఇస్తారు. ఈ పదిహేను రోజులు ప్రధాన అర్చకులకు తప్ప, మరెవరికీ ఆ గదిలోకి ప్రవేశం ఉండదు. పూరీలో అయితే స్వామికి వైద్యం చేయడానికి ప్రత్యేక ఆయుర్వేద వైద్యులను రంగంలోకి దించుతారు. మిగతా ఆలయాల్లో అర్చకులే స్వయంగా ఈ వైద్య సేవలు అందిస్తారు. ఈ సమయంలో భక్తులకు స్వామి దర్శనాలు నిలిపేస్తారు. 15 రోజుల పాటు చీకటి గదిలో విశ్రాంతి తీసుకుని, ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా కోలుకున్న జగన్నాథుడు.. అమావాస్య నాడు అంటే ఈ నెల14న మళ్లీ బయటకు వస్తాడు. దీనినే ‘నేత్రోత్సవం’ అంటారు. ఆ రోజున ఆలయంలో ప్రత్యేక హోమాలు, సంప్రోక్షణలు నిర్వహించి, స్వామికి తిరిగి ఇష్టమైన అన్నభోగాన్ని పెడతారు. పూర్తి ఆరోగ్యవంతుడైన జగన్నాథుడు, మరుసటి రోజు.. తొలి దశమి నాడు అన్న బలభద్రుడు, చెల్లి సుభద్రా దేవిలతో కలిసి రథాలెక్కి పురవీధుల్లోకి వస్తాడు. అదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘జగన్నాథ రథయాత్ర’. అక్కడి నుంచి గుండిచా మందిరానికి చేరుకుని, ముచ్చటగా తొమ్మిది రోజులు అక్కడే ఉండి.. తిరిగి దశమి నాడు ప్రధాన ఆలయానికి చేరుకోవడంతో ఈ మహా ఘట్టం ముగుస్తుంది. “మొత్తానికి పూరీ జగన్నాథ క్షేత్రం నుంచి ఉత్తరాంధ్ర పాలకొండ వరకు.. త్వరలోనే స్వామివారి జ్వరం తగ్గి, నవయవ్వన తేజస్సుతో ఆయన రథమెక్కి వచ్చే ఆ మహా వైభవాన్ని వీక్షించడానికి ఇప్పుడు కోట్లాది కళ్లు ఎదురుచూస్తున్నాయి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..

రుషికొండ భవనాలు ఏం చేయబోతున్నారో తెలుసా?

బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..

ద్రవ్యోల్బణం కంటే ‘ఏఐ’తోనే పెను ముప్పు ఆర్‌బీఐ సంచలన నివేదిక!

నాడు ఏకే-47 పట్టిన చేతులతోనే.. నేడు నాగలిపట్టి సేద్యం

Follow Us