తండ్రితో కలిసి రీల్స్‌ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి.. అసలు ఏం జరిగింది

Updated on: Jan 21, 2026 | 5:39 PM

తండ్రి, కూతుళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఓ విషాద ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్లిన లాస్య, అతనిపై ప్రేమను చూపిస్తూ తీసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో, ఆలయ కొనేరులో జారిపడి మరణించింది. ఈ హృదయ విదారక ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది, నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

సాధారణంగా ఏ తండ్రికైనా ఆడపిల్లలంటే ఇష్టం. తన కూతురిని అమ్మలా ప్రేమిస్తారు… ఇంటి మహలక్ష్మిలా భావిస్తారు. ఇక ఆడపిల్లలకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. అలా నాన్నంటే దైవంగా భావించే ఓ కూతురు తండ్రితో కలిసి దైవదర్శనానికి వెళ్లింది. తను మరో ఇద్దరు బిడ్డలకు తల్లైనా.. నాన్న దగ్గర ఆమె పసిపిల్లే. అలా నాన్నమీద ప్రేమతో గుడిదగ్గర నాన్నతో కలిసి రీల్‌ చేసింది. అతంతరం ఆలయంలో దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన చంద్రకళ-ఇస్తారి దంపతుల కూతురు లాస్య. లాస్యను ఎనిమిదేళ్ల క్రితం యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన కర్రే అనిల్‌కు ఇచ్చి వివాహం చేశారు. అనిల్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, లాస్య ఇంటి వద్దే ఉంటుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లాస్య నిత్యం పరిసరాలు, సామాజిక అంశాలపై రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. లాస్య భర్త అనిల్ అయ్యప్ప మాల ధరించి శబరిమలకు వెళ్ళాడు. లాస్య కూతురు పుట్టినరోజు సందర్భంగా తన తల్లిగారి ఇల్లు పులిగిల్లకు వచ్చింది. గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయానికి తన తండ్రి, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళింది. మెట్ల మార్గంలో తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకునే క్రమంలో.. తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తీకరిస్తూ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మెట్లు ఎక్కుతూ ఆలయానికి చేరుకుంది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే క్రమంలో ఆలయం కోనేరులోకి దిగి నీళ్లు చల్లుకుంటుండగా జారిపడి లాస్య మృతి చెందింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందే తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకుంది. నాయనా.. నాయనా అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం కంటతడి పెడుతున్నారు. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. లాస్య మరణ వార్తతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాన్నా కాపాడు అంటూ ఫోన్‌ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

Vande Bharat: ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..

Tollywood News: టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?

సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి

Anil Ravipudi: అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్