గుండెపోటుతో ఆసుపత్రికి మహిళ..రీల్స్‌ చూస్తూ కూర్చున్న డాక్టర్‌.. చివరకు..

Updated on: Jan 30, 2025 | 1:50 PM

ఓ వైద్యుడి నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని మైన్‌పురిలో జరిగింది. గుండెపోటు తో బాధపడుతున్న మహిళను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చినా వైద్యులు సరైన సమయంలో వైద్యం అందించక పోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మైన్‌పురి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి అనే 60 ఏళ్ల మహిళకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని మహారాజా తేజ్‌సింగ్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌ ఆదర్శ్‌ సెంగార్‌ను సంప్రదించగా బాధితురాలి వద్దకు నర్సులను పంపి.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చూస్తూ కూర్చున్నాడు. మహిళ కుటుంబసభ్యులు వైద్యం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఐదు నిమిషాల పాటు బాధతో విలవిలలాడిన బాధితురాలు సరైన వైద్య సహాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు డాక్టర్‌పై దాడి చేశారు.