ఆరు పదుల వయసులోనూ గుర్రంపై సవారీ.. అదుర్స్‌

Updated on: Oct 16, 2025 | 8:24 PM

ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణ సాధనంగా ఎడ్లబండినో, గుర్రపు బండినో ఉపయోగించేవారు. కాలక్రమేణా ఇవన్నీ మూలన పడిపోయాయి. ఇప్పుడు.. వ్యవసాయ పనులకు కూడా యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. ఇక ప్రయాణాలకైతే జెట్‌ స్పీడులో చేరవేసే విమానాలు కూడా వచ్చేశాయి. అయినా ఓ వ్యక్తి మాత్రం తన మూలాలను మరిచిపోకుండా.. నేటికీ తన పాత వాహనాన్నే వాడుతున్నాడు.

ముప్పై ఏళ్లుగా దాని మీదే ప్రయాణం చేస్తూ పర్యావరణ హితాన్ని సూచిస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నాడు అరవైయ్యేళ్ల లక్ష్మా రెడ్డి. తెనాలి వీధుల్లో రాజఠీవి లేదుగానీ.. తెల్లని దుస్తుల్లో మెరిసి పోతున్న ఓ పెద్దాయన ఏకంగా గుర్రంపైనే సవారీ చేస్తున్నాడు. ఎందుకు గుర్రం ఎక్కాడో కనుక్కుందామని మాటలు కదిపితే విస్తుపోయే నిజాలెన్నో చెప్పేశాడు. తెనాలి మండలం కారుమూరి వారి పాలెం నివాసి.. లక్ష్మా రెడ్డి సోమవారం LIC కట్టడానికి తెనాలికి గుర్రంపై వచ్చారు. ఈ రోజుల్లో కూడా గుర్రంపై రావడమేంటి బాబాయ్‌.. అంటే గత ముప్పై ఏళ్లుగా తన వాహనం ఇదేనని చెప్పారు. దీనివెనుక ఓ చిన్న కథ కూడా చెప్పారు. చిన్నప్పుడు గుర్రం కొంటానని..తన బాబాయితో చెబితే ‘నీకు గుర్రం కొనేంత సీన్‌ లేదు’అని ఎగతాళి చేశారట. ఆ రోజుల్లో ఆ మాటలు మనస్సుకు కష్టం కలిగించాయని, పెద్ద అయిన తర్వాత గుర్రం కొనాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపాడు. తనకి 25 ఏళ్లు వచ్చిన తర్వాత గుర్రం కొన్నానని ఇప్పటికి ఐదు గుర్రాలు మార్చినట్లు చెప్పారు. చుట్టుపక్కల గ్రామాలకే గాక.. బంధువుల ఇంటికీ గుర్రం మీదనే వెళతానని అన్నారు. తానేం సంపన్నుడిని కాదని, పెద్దగా చదువుకోలేదని, తనకున్న 60 సెంట్ల భూమిని సాగుచేసుకుంటూ.. ఉన్నంతలో జీవితాన్ని గడుపుతున్నట్లు సంతోషంగా చెప్పుకొచ్చారు. తన ఇద్దరు పిల్లలు ఉన్నత చదువులు చదువుకొంటున్నారని తెలిపాడు. గుర్రం పోషణకు పెద్దగా ఖర్చేమీ కాదని,దానికి సాధారణ మేతనే వేస్తానంటున్నాడు. గుంతల రోడ్లపైన కూడా తన వాహనం బోల్తా కొట్టదంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోతి చేతిలో నోట్ల కట్టలు.. చెట్టెక్కి చెలరేగిపోయిన వానరం

ప్రయాణీకులకు అలర్ట్.. రైళ్లలో అవి తీసుకెళ్తే రూ.1000 జరిమానా

చితిపై ఉంచగానే మృతదేహం నుంచి ఓంకారం

విమాన టికెట్ ధర.. ఇక ఫిక్స్..

క్షణాల్లో కుప్పకూలిన కొత్త హైవే.. షాకైన జనం