తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

Updated on: Dec 24, 2025 | 11:19 AM

కొడుకు అల్లాడి రాజు తన దివంగత తండ్రి ఎల్లయ్యపై ఉన్న అపారమైన ప్రేమను వరి పొలంలో చాటుకున్నాడు. తండ్రి పేరును నారుతో చెక్కిన విధానం అందరినీ ఆకట్టుకుంది. తండ్రి త్యాగాలను స్మరిస్తూ, ఆయన పేరు ఈ నేలపై పచ్చగా ఉండాలనే రాజు భావోద్వేగం, సమాజానికి గొప్ప సందేశం. ఈ అరుదైన నివాళి తండ్రి-కొడుకుల బంధానికి ప్రతీక.

నాన్న అంటే పిల్లలకు ఓ ఎమోషన్. తను మరో బిడ్డకు తండ్రయినా.. తను మాత్రం తన తండ్రికి పసివాడే.. తండ్రి పిల్లలను పెంచి పోషించడానికి, వారికి మంచి భవిష్యత్తును నిర్మించడానికి ఎంతో కష్టపడతాడు. ఎన్నో త్యాగాలు చేస్తాడు. ప్రేమతో పెంచి పెద్ద చేసిన నాన్న అంటే.. సంతానానికి అమితమైన ప్రేమ, గౌరవం ఉంటాయి. అలాంటి తండ్రిని కోల్పోతే కలిగే బాధ వర్ణనాతీతం. అది తీరని లోటు. అలా ఎంతో ప్రేమగా పెంచి పోషించిన తండ్రిని కోల్పోయిన ఓ కొడుకు తన తండ్రిపై ఉన్న ప్రేమను ఆ తండ్రికి ఎంతో ఇష్టమైన వ్యవసాయ పొలంలో చాటుకున్నాడు. తన తండ్రి పేరు ప్రతిబింబించేలా చేసిన వరి సాగు ఇప్పుడు వాహ్ అనిపిస్తుంది. రెక్కలు ముక్కలు చేసుకుని చిన్నప్పటి నుంచి తన తండ్రి పొలం పనులు చేస్తుండటం గమనిస్తూ వస్తున్న కొడుకు ఆ పొలంలోనే తన తండ్రి పేరును నారుగా పోశాడు.. అది ఏపుగా పెరిగి పచ్చగా కనువిందు చేస్తుంటే..తన తండ్రినే చూస్తున్నట్టుగా మురిసిపోయాడు ఆ కొడుకు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామానికి చెందిన అల్లాడి రాజు తండ్రి అల్లాడి ఎల్లయ్య కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. తనకు మెరుగైన జీవనం ఇవ్వడం కోసం ఎంతో కష్టపడ్డ ఆ తండ్రిపై కొడుక్కు ఎనలేని ప్రేమ. ఉదయం లేవగానే పొలాలకు వెళ్లి పంటను కంటికి రెప్పలా చూసుకునే ఎల్లయ్య.. గ్రామంలో మంచి రైతుగా పేరొందారు. తండ్రి మృతి తరువాత పొలం పనులను చేపట్టిన రాజు తన నారు పనులను ప్రారంభించే ముందు పంట పొలంలోనే నారుతో తన తండ్రి పేరును చెక్కి అందరికి విభిన్నంగా కనిపించేలా చేశాడు. పచ్చగా వికసిస్తున్న నారులో ‘ఎల్లయ్య ‘ అనే అక్షరాల ఆకారంలో నారు పెంచాడు. ఈ యువ రైతుకు తండ్రిపై ఉన్న ప్రేమ పొలంలో కనిపించేసరికి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. “నాన్నకి ప్రేమతో… ఆయన పేరు ఈ నేలపై ఎప్పటికీ పచ్చగా ఉండాలి” అని రాజు భావోద్వేగానికి లోనయ్యాడు. రాజు చేసిన పనిని గ్రామస్తులు అభినందిస్తూ తండ్రి పట్ల అతని ప్రేమను ప్రశంసిస్తున్నారు. వృద్దాప్యంలో కన్నవారిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లలో అనాథలుగా వదిలేస్తున్న ఈ రోజుల్లో తండ్రిని స్మరించుకుంటూ ఈ యువ రైతు చేసిన పనికి ప్రతి ఒక్కరూ శభాష్ అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ గుడి మీద మైక్‌ లేదా ?? ఈ టీటీడీ ఆఫర్ మీకే

ఏవియేషన్‌ చరిత్రలో అద్భుతం.. ప్రకృతి థీమ్‌తో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్

Duvvada Srinivas: రమ్య మోక్షకు బిగ్‌బాస్ అన్యాయం

ఆయనకు రూ.50లక్షలు.. ఆమెకు రూ.40 లక్షలు!.. కానీ తనూజకే ఎక్కువ పైసలు

కొడుకుకు రూ.40 లక్షలు.. అమ్మకు రూ.42 లక్షలు!..ఇద్దరికీ జాక్ పాట్